Ishrat Jahan: ఇష్రత్ జహాన్ బూటకపు ఎన్ కౌంటర్ కేసు: చివరి ముగ్గురు పోలీస్ అధికారులకూ విముక్తి
- కేసు నుంచి తప్పించిన సీబీఐ ప్రత్యేక కోర్టు
- ఈ నెల 20న డిశ్చార్జి పిటిషన్ వేసిన అధికారులు
- విచారణ అనుమతులు నిరాకరించిన గుజరాత్ కోర్టు
- కోర్టుకు లేఖ సమర్పించిన సీబీఐ అధికారులు
- వారిని కేసు నుంచి తప్పిస్తూ జడ్జి ఉత్తర్వులు
సంచలనం సృష్టించిన ఇష్రత్ జహాన్ ఫేక్ ఎన్ కౌంటర్ కేసులో చివరి ముగ్గురు పోలీసు అధికారులకూ విముక్తి లభించింది. కేసు నుంచి వారిని తప్పిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. జీఎల్ సింఘాల్, తరుణ్ బరూత్, అనాజూ చౌధరిలు.. మార్చి 20న కోర్టులో డిశ్చార్జి (విముక్తి కల్పించాలని కోరుతూ) పిటిషన్ వేశారు. తమను విచారణ నుంచి తప్పించాలని కోరారు. ఆ పిటిషన్ ను విచారించిన సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి వీఆర్ రవళ్.. వారి విజ్ఞప్తిని మన్నించి కేసు నుంచి విముక్తి కల్పించారు.
ఇక, వారిని విచారించేందుకు గుజరాత్ ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదని, దాని కోసం పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించిందని సీబీఐ తరఫు న్యాయవాది స్పెషల్ ప్రాసిక్యూటర్ ఆర్సీ కోడేకర్ కోర్టుకు తెలిపారు. ఇంతకుముందే దీనికి సంబంధించిన లేఖనూ న్యాయస్థానానికి అందజేశామన్నారు.
డ్యూటీలో భాగంగానే అధికారులు ఎన్ కౌంటర్ చేశారు కాబట్టి.. విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని తీసుకోవాల్సిందిగా సీబీఐకి గత ఏడాది అక్టోబర్ లో సీబీఐ స్పెషల్ కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలోనే అనుమతి తీసుకునేందుకు దరఖాస్తు పెట్టుకున్నా గుజరాత్ ప్రభుత్వం ఒప్పుకోలేదు.
ఇదీ కేసు..
ముంబైలోని ముంబ్రకు చెందిన 19 ఏళ్ల ఇష్రత్ జహాన్ ను గుజరాత్ పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. జావెద్ షేక్ అలియాస్ ప్రాణేశ్ పిళ్లై, అమ్జదలీ అక్బరలీ రాణా, జీషన్ జోహార్ లతో కలిసి వెళుతుండగా.. 2004 జూన్ 15న అహ్మదాబాద్ సమీపంలో గుజరాత్ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
ఆ నలుగురు ఉగ్రవాదులని, నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీని చంపేందుకు వారు కుట్ర చేశారని పోలీసులు చెప్పారు. ఘటనపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. హైకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తులో అది బూటకపు ఎన్ కౌంటర్ అని తేలింది. తర్వాత ఆ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది.
2013లో ఏడుగురు పోలీసు అధికారులపై సీబీఐ తొలి చార్జిషీటును దాఖలు చేసింది. గుజరాత్ మాజీ ఇన్ చార్జి డీజీపీ పీపీ పాండే, డీజీ వంజర, ఎన్కే అమీన్, సింఘాల్, బరూత్, పార్మర్, చౌధరీ పేర్లను అందులో చేర్చింది. అయితే, కేసు విచారణ సందర్భంగా పార్మర్ చనిపోగా.. 2018లో పాండేకు కేసు నుంచి సీబీఐ ప్రత్యేక కోర్టు విముక్తి కల్పించింది. 2019లో వంజర, అమీన్ లనూ కేసు నుంచి తప్పించింది. తాజాగా మిగిలిన ముగ్గురికీ ఆ కేసు నుంచి విముక్తి కల్పించింది.