Heat Wave: ఏపీ, తెలంగాణలో వడగాడ్పులు... వాతావరణ శాఖ హెచ్చరిక
- తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
- ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు
- రానున్న మూడ్రోజులు వడగాడ్పులు
- ఏపీలో నాలుగు జిల్లాలకు హెచ్చరికలు
- తెలంగాణలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పెరిగే అవకాశం
ఏపీలో ఈసారి వేసవి తీవ్రంగా ఉండనున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఇంకా మే నెల రాకముందే వడగాడ్పులు మొదలయ్యాయి. ఏపీలో దక్షిణ కోస్తా తీరం వెంబడి రాబోయే మూడు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉంటుందని వివరించింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపైనా వడగాడ్పుల ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు.
అటు, తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. రాష్ట్రంలో ఉత్తర దిక్కు నుంచి వేడిగాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మూడు రోజుల పాటు రాష్ట్రంలో వడగాడ్పులు తప్పవని, ఈ మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు ఇళ్లలో ఉండడం శ్రేయస్కరం అని, మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అధిక వేడిమి ఉండే అవకాశం ఉందని, ఆ సమయంలో వీలైనంత వరకు బయటికి రావొద్దని పేర్కొంది.