Ever Given: ‘ఎవర్ గివెన్’లోని భారత సిబ్బంది క్షేమం!
- నౌకతో పాటే ప్రయాణం
- రోటర్ డ్యామ్ కు భారీ షిప్పు
- వారు బాగా కష్టపడ్డారన్న సంస్థ
- ఇప్పుడు జోక్యం చేసుకోవడం మంచిది కాదన్న భారత్
- ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ
సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయి.. మొన్ననే మళ్లీ పక్కకు తొలగిన ‘ఎవర్ గివెన్ (ఎవర్ గ్రీన్)’ నౌకలోని భారత సిబ్బంది క్షేమంగా ఉన్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారిని మార్చబోమని అన్నారు. ఓడ అంతాబాగా ఉందని పరీక్షల్లో తేలితే.. ముందు అనుకున్న గమ్యస్థానం యూరప్ లోని అతిపెద్ద ఓడరేవు అయిన రోటర్ డ్యామ్ కు ఎవర్ గివెన్ వెళుతుందని, భారత సిబ్బంది కూడా వెళతారని చెప్పారు.
ఎవర్ గివెన్ నిర్వహణ బాధ్యతలను చూస్తున్న జర్మనీ సంస్థ బెర్నార్డ్ షల్ట్ షిప్ మేనేజ్ మెంట్ (బీఎస్ఎం) అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘వారంతా సురక్షితం. వారి ఆరోగ్యం కూడా బాగుంది. షిప్పును పక్కకు తీయడంలో వారు ఎంతో కష్టపడ్డారు. అవిశ్రాంతంగా పనిచేశారు’’ అని కొనియాడారు.
ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగానే ఉన్నందున తాము జోక్యం చేసుకోవడంలో అర్థం లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ అమితాబ్ కుమార్ అన్నారు. ఏదైనా షిప్పుకు ప్రమాదం జరిగితే దాని అంతర్జాతీయ తీరప్రాంత సంస్థ (ఐఎంవో) విధానాల ప్రకారమే దర్యాప్తు జరుగుతుందన్నారు.
ఎవర్ గివెన్ విషయంలోనూ అదే జరుగుతుందన్నారు. నిజానిజాలను తెలుసుకునేందుకు దర్యాప్తు సాగుతుందన్నారు. దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని సదరు సంస్థ నుంచి ఫిర్యాదు అందితే తప్ప జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు.