India: వరుసగా ఐదో రోజూ తగ్గిన బంగారం ధర... పది గ్రాములు రూ. 44,300!
- నేడు రూ. 640 తగ్గిన బంగారం ధర
- ఇంటర్నేషనల్ మార్కెట్ లోనూ ఆదే ట్రెండ్
- మరింతగా తగ్గే అవకాశాలు
ఇండియాలో బంగారం ధరలు వరుసగా ఐదో రోజూ తగ్గాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గుదల బాటలో నడుస్తుండటంతో, ఆ ప్రభావం మల్టీ కమోడిటీ ఎక్చేంజ్ (ఎంసీఎక్స్)పై పడింది. మంగళవారం నాడు అర శాతం వరకూ పడిపోయిన బంగారం ధర, బుధవారం మరో 0.3 శాతం తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 44,300కు తగ్గింది.
ఇదే సమయంలో రెండు రోజుల వ్యవధిలో వెండి ధర 2.50 శాతానికి పైగా తగ్గడంతో కిలో వెండి రూ. 52,617కు దిగి వచ్చింది. 22 క్యారెట్ స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ. 640 రూపాయలు తగ్గి రూ. 43,630 వద్ద కొనసాగుతోంది.
వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిస్తే, కేరళలో రూ. 41,350, రూ. 45,110గా, అహ్మదాబాద్ లో రూ. 43,850, రూ. 45,690గా, భువనేశ్వర్ లో రూ. 41,350, 45,110గా, పూణెలో రూ. 43,620, 44,620 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నం విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 41,350 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,100 వద్ద కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 0.1 శాతం పతనమై 1,683 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర ఔన్సుకు 24 డాలర్లు పలుకుతోంది. ఇదే సమయంలో ప్లాటినమ్ ధర ఔన్సుకు అర శాతం తగ్గి 1,160 డాలర్ల వద్ద, పల్లాడియం ధర 0.7 శాతం తగ్గి 2,607 డాలర్ల వద్దా కొనసాగుతోంది.
బంగారం ధరలు సమీప భవిష్యత్తులో మరింతగా పతనం కావచ్చని బులియన్ పండితులు అంచనా వేస్తున్నారు. చైనాలో పారిశ్రామికోత్పత్తి పెరగడం, అమెరికా ఆర్థిక శక్తి తిరిగి పుంజుకునేలా ట్రిలియన్ డాలర్ల విలువైన ప్రణాళికను బైడెన్ ప్రకటించడంతో బులియన్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించిందని, పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్ వైపు వెళుతున్నాయని వ్యాఖ్యానించారు.