Ramesh Jarkiholi: రమేశ్ జార్కిహోళి బెదిరింపులకు భయపడి ఇన్నాళ్లూ దాక్కున్నా: రాసలీలల సీడీ కేసులోని యువతి
- అజ్ఞాతం వీడి కోర్టుకు హాజరైన యువతి
- మాజీ మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉందన్న యువతి
- రమేశ్ ఇచ్చిన బహుమతులను కోర్టుకు సమర్పించిన బాధితురాలు
- మాజీ మంత్రిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం?
తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి బలమైన నాయకుడు కావడంతోనే తాను అజ్ఞాతంలోకి వెళ్లానని రాసలీలల సీడీలోని యువతి న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. రమేశ్ జార్కిహోళి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె వాపోయింది. దాదాపు 28 రోజులపాటు అజ్ఞాతంలో ఉన్న బాధిత యువతి నిన్న మధ్యాహ్నం రెండున్నర గంటలకు బెంగళూరు వసంతనగర్‌లో ఉన్న ఏసీఎంఎం కోర్టుకు హాజరైంది.
అనంతరం రెండు గంటలపాటు జడ్జి బాలగోపాల్ కృష్ణ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలను వెల్లడించింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, రమేశ్ జార్కిహోళి బెదిరింపుల వల్లే తాను అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందని పేర్కొంది. ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని, తన తల్లిదండ్రులు, సోదరుడిపైనా ఆయన ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించింది.
మాజీ మంత్రి తనకు ఇచ్చిన బహుమతులు, ఆయనతో తీసుకున్న ఫొటోలు, చాటింగ్, వీడియో, మొబైల్ సందేశాలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అందించింది. మరోవైపు, వైద్య పరీక్షలు పూర్తయ్యే వరకు ఆమె తమ రక్షణలోనే ఉండాలని కోరిన సిట్.. 8 మంది మహిళా పోలీసులతో బాధిత యువతికి రక్షణ కల్పించినట్టు సమాచారం.
యువతి తరపు న్యాయవాది జగదీశ్ మాట్లాడుతూ.. తాము ఇచ్చిన మాట ప్రకారం యువతిని కోర్టుకు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఇప్పుడు ఇక పోలీసులు తమ పని తాము చేయాలని సూచించారు. నిందితుడు స్వేచ్ఛగా బయట తిరగకుండా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంకోవైపు, పోలీసులు తనను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న వార్తలతో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయాలని రమేశ్ జార్కిహోళి నిర్ణయించినట్టు తెలుస్తోంది.