TRS: నాగార్జునసాగర్‌లో బీజేపీకి వరుస షాకులు!
- కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన అంజయ్య యాదవ్
- బీజేపీ రెబల్‌గా నామినేషన్ వేసిన నివేదితారెడ్డి
- ఆమెను టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చే యత్నం
నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి వరుస షాకులు తగులుతున్నాయి. చివరి వరకు ఆ పార్టీ టికెట్ తనకే దక్కుతుందని భావించి భంగపడిన ఆ పార్టీ నేత కడారి అంజయ్య యాదవ్ నిన్న టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఆయన గులాబీ కండువా వేసుకున్నారు.
సాగర్‌లో భగత్‌ను గెలిపించాలని, మీ రాజకీయ ఎదుగుదలను పార్టీ చూసుకుంటుందని ఈ సందర్భంగా అంజయ్యకు సీఎం హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున నాగార్జున సాగర్‌లో పోటీ చేసిన అంజయ్య యాదవ్ కు 27 వేల ఓట్లు లభించాయి. ఏడాదిన్నర క్రితమే ఆయన బీజేపీలో చేరారు.
సాగర్‌లో తమ అభ్యర్థిగా రవికుమార్ నాయక్‌ను ప్రకటించిన తర్వాత బీజేపీలో అసంతృప్త జ్వాలలు ఎగసిపడ్డాయి. అంజయ్య యాదవ్ టీఆర్ఎస్ గూటికి చేరగా, మరో నేత కంకణాల నివేదితారెడ్డి బీజేపీ రెబల్‌గా నామినేషన్ వేయడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. టీఆర్ఎస్ నేతలు ఆమెతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆమె కనుక టీఆర్ఎస్‌లో చేరితే నామినేషన్ ఉపసంహరించుకుంటారని సమాచారం.