Adilabad District: ప్రసూతి వార్డులోకి భారీ నల్లత్రాచు.. రోగుల ఉరుకులు పరుగులు.. ఇదిగో వీడియో!
- ఆదిలాబాద్ రిమ్స్ లో ఘటన
- పాములు పట్టేవారికి సమాచారం
- వచ్చి చూస్తే జాడలేని సర్పం
- వేరే వార్డుకు రోగుల మార్పు
మొన్నటికి మొన్న ఏసీలో మంటలు చెలరేగి.. రోగులను ఆందోళనకు గురి చేసింది. ఇప్పుడు ఓ భారీ నల్లత్రాచు పాము పేషెంట్ల బెడ్ల కిందకు జొరబడింది. ఆదిలాబాద్ రిమ్స్ లో జరిగిందీ ఘటన. గర్భిణులు, బాలింతలు ఉండే ప్రసూతి వార్డులోకి ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదుగానీ.. ఏడెనిమిది అడుగుల పొడవున్న ఓ భారీ త్రాచు వచ్చింది.
ఒక్కసారిగా అంత పెద్ద పామును చూసేసరికి రోగులు భయాందోళనలకు గురయ్యారు. కేకలు వేస్తూ పరుగులు తీశారు. దీంతో పాము బాత్రూంలోకి వెళ్లిపోయింది. ఆసుపత్రి సిబ్బంది పాములు పట్టేవారికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసినా పాము జాడ కనిపించలేదు. దీంతో రోగులను వేరే వార్డులోకి మార్చారు.
అయితే, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఆసుపత్రి నిర్వహణపై కనీస పట్టింపు లేకపోవడం వల్లే ఇటీవల షార్ట్ సర్క్యూట్, ఇప్పుడు పాము ఘటనలు జరిగాయని రోగులు, వారి తరఫు బంధువులు ఆరోపించారు.