Hyderabad: బైకర్ నిర్లక్ష్యం.. రెండు లారీల ఢీ, వీడియో వైరల్

Dreaded Accident in Rajendranagar

  • రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • బైకర్ ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో టిప్పర్ ను మళ్లించిన డ్రైవర్
  • బైకర్ కోసం పోలీసుల గాలింపు

ఓ గల్లీ నుంచి బైక్‌పై అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన వ్యక్తి  ప్రాణాలు కాపాడేందుకు ఓ లారీ డ్రైవర్ తీసుకున్న నిర్ణయం పెను ప్రమాదానికి కారణమైంది. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ప్రమాదానికి కారణమైన బైకర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.

కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన వెంకటరాముడు (50), క్లీనర్ శివ (30) తో కలిసి లారీలో నిన్న హిమాయత్‌సాగర్ నుంచి రాజేంద్రనగర్ వైపు వస్తున్నారు. అదే సమయంలో రాజేంద్రనగర్ నుంచి హిమాయత్‌సాగర్ వైపు కంకరలోడుతో ఓ టిప్పర్ వేగంగా వస్తోంది. ఈ క్రమంలో గాంధీనగర్ చౌరస్తా వద్దకు రాగానే బస్తీలోంచి ఓ వ్యక్తి బైక్‌పై అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చేశాడు. గమనించిన టిప్పర్ డ్రైవర్ తిరుపతయ్య బైకర్‌ను తప్పించే ప్రయత్నంలో తన వాహనాన్ని క్షణాల్లోనే అవతలి రోడ్డువైపు మళ్లించాడు.

అయితే, అదే సమయంలో అటునుంచి వేగంగా వస్తున్న లారీని టిప్పర్ ఢీకొట్టింది. దీంతో వాహనాలు రెండూ రోడ్డు పక్కన బోల్తాపడ్డాయి. ప్రమాదంలో వెంకటరాముడు, శివ తీవ్రంగా గాయపడ్డారు. బైకర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను బట్టి తెలుస్తోంది. దీంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News