KCR: గత ఏడాది లాగే వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనుగోలు చేస్తాం: సీఎం కేసీఆర్
- ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
- 6,408 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
- కనీస మద్దతుధర నిబంధనలు పాటించాలని స్పష్టీకరణ
- తాలు, తేమ లేకుండా చూడాలని రైతులకు సూచన
కరోనా విజృంభణ నేపథ్యంలో వరి ధాన్యాన్ని రైతుల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నందున, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గత ఏడాది లాగే గ్రామాల్లో పూర్తిస్థాయిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అందుకోసం 6,408 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వీటిలో 2,131 ఐకేపీ కేంద్రాలు, 3,964 పీఏసీఎస్ కేంద్రాలని, ఇతర కేంద్రాలు మరో 313 ఉన్నాయని వివరించారు.
నేడు ప్రగతిభవన్ లో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలపై కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలుకు అవసరమైన రూ.20 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు మంగళవారం సాయంత్రానికల్లా ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కనీస మద్దతు ధర నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా, రైతులు వడ్లను ఎండబోసి తాలు లేకుండా చూడాలని, తేమ 17 శాతం మించకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.