Indonesia: ఇండోనేషియాలో క్రైస్తవుల లక్ష్యంగా ఆత్మాహుతి దాడి...సీసీటీవీలో దృశ్యాలు!
- సాక్రెడ్ హార్ట్స్ ఆఫ్ జీసస్ కేథడ్రల్ ప్రాంగణంలో ఘటన
- సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగి పేల్చేసుకున్న బాంబర్స్
- ఆత్మాహుతి బృందంలో ఒక మహిళ కూడా
ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో క్రైస్తవులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరగడం కలకలం రేపింది. మకస్సర్ లోని సాక్రెడ్ హార్ట్స్ ఆఫ్ జీసస్ కేథడ్రల్ ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది. చర్చి లోపలికి ఇద్దరు ఆగంతుకులు ప్రవేశించేందుకు యత్నించగా, అక్కడి భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు.
ఆపై వారి మధ్య వాదులాట జరుగుతుండగానే, వచ్చిన ఇద్దరిలో ఒకరు, తన శరీరానికి అమర్చుకున్న బాంబులను పేల్చేసుకున్నాడు. దీంతో అక్కడ భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, నలుగురు సెక్యూరిటీ సిబ్బంది, ప్రార్థనల అనంతరం బయటకు వస్తున్న పలువురు గాయపడ్డారు. ఆత్మాహుతి దళంలో ఓ మహిళ కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఇంతవరకూ ఏ గ్రూప్ కూడా ప్రకటించలేదు. చర్చిపై దాడి గురించి తెలుసుకున్న పోప్ ఫ్రాన్సిస్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. బాధితుల స్వస్థత కోసం ప్రార్థిస్తున్నానని అన్నారు.