Rahul Gandhi: చిన్న, మధ్యస్థ వ్యాపారాలు, ఉత్పాదక రంగాలే తమిళనాడుకు వెన్నెముక... నాశనం చేయాలని చూస్తున్నారు: రాహుల్ గాంధీ
- తమిళనాడు ఎన్నికల ప్రచారంలో రాహుల్ వ్యాఖ్యలు
- నోట్ల రద్దుతో దెబ్బతీశారని వెల్లడి
- ఆ తర్వాత జీఎస్టీతో ధ్వంసం చేశారని విమర్శలు
- ఇప్పుడు వారి దృష్టి వ్యవసాయ రంగంపై పడిందని ఆరోపణ
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల బరిలో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. తమ కూటమి అభ్యర్థుల కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమిళనాడుకు చిన్న, మధ్య తరహా వ్యాపారాలే వెన్నెముక లాంటివని... తమిళనాడు దేశానికే ఉత్పాదక రంగ రాజధానిగా విలసిల్లుతోందని అన్నారు. అయితే, ఈ వ్యవస్థలను నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
నోట్ల రద్దు నిర్ణయం ద్వారా ఈ వ్యవస్థలపై దాడి చేశారని విమర్శించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను, వ్యాపారాలను బలహీనపర్చేందుకు ఈ దాడులు జరిగాయని అన్నారు. నోట్ల రద్దు తర్వాత, తమిళనాడుపై జరిగిన మరో దాడి జీఎస్టీ అని వివరించారు. జీఎస్టీ తీసుకువచ్చి తమిళనాడు ఉత్పాదక రంగాన్ని ధ్వంసం చేశారని, ఇప్పుడు వారి దృష్టి తమిళనాడు వ్యవసాయ రంగంపై పడిందని పరోక్షంగా బీజేపీ నేతలపై వ్యాఖ్యలు చేశారు.