Rathna Prabha: సీఎం జగన్ ను అభినందిస్తూ ట్వీట్ చేసింది నిజమే... అందులో తప్పేంటి?: రత్నప్రభ
- 2019లో జగన్ గెలిచాక అభినందిస్తూ రత్నప్రభ ట్వీట్
- దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారని వెల్లడి
- ఏపీపై అభిమానంతోనే తిరుపతిలో పోటీ చేస్తున్నానని వివరణ
- గెలిస్తే పార్లమెంటులో గళం వినిపిస్తానని ఉద్ఘాటన
- జనసేన రెండొందల శాతం మద్దతిస్తోందని స్పష్టీకరణ
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. 2019 ఎన్నికల అనంతరం చేసిన ఓ ట్వీట్ ను ఇప్పుడు వైరల్ చేస్తున్నారని వెల్లడించారు. నాడు వైఎస్ జగన్ సీఎంగా గెలిచాక ఆయనను అభినందిస్తూ ఆ ట్వీట్ చేశానని, అందులో తప్పేమీ లేదు కదా అని వ్యాఖ్యానించారు. తాను కర్ణాటకలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించినా, తన జన్మభూమి ఆంధ్రప్రదేశ్ అని ఉద్ఘాటించారు.
తాను తిరుపతి ఎంపీగా విజయం సాధిస్తే స్థానిక సమస్యలపై లోక్ సభలో గట్టిగా గళం వినిపిస్తానని పేర్కొన్నారు. వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నా, వారిలో పార్లమెంటులో లేచి నిలబడి సమస్యల గురించి మాట్లాడేవారు ఒక్కరూ లేరని విమర్శించారు. ప్రజలు తమ ఆలోచన విధానం మార్చుకోవాలని, డబ్బు తీసుకుని అవినీతిపరులకు ఓట్లు వేయొద్దని సూచించారు.
ఉప ఎన్నిక నేపథ్యంలో జనసేన పార్టీ తమకు రెండొందల శాతం మద్దతు ఇస్తోందని రత్నప్రభ స్పష్టం చేశారు. బీజేపీకి జనసేన సహకరించడంలేదని ప్రచారం చేస్తున్నారని, అందులో నిజంలేదని అన్నారు. తిరుపతి బరిలో తన అభ్యర్థిత్వం పట్ల పవన్ కల్యాణ్ పూర్తి సంతృప్తిగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.