Raj Nath Singh: 'అక్కడ విమర్శలు.. ఇక్కడ స్నేహం'.. కాంగ్రెస్, వామపక్ష పార్టీలపై రాజ్‌నాథ్ విమర్శలు
- కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్‌నాథ్
- కాంగ్రెస్, వామపక్ష పార్టీలు వ్యతిరేకించుకుంటున్నాయని వ్యాఖ్య
- పశ్చిమ బెంగాల్‌లో మాత్రం పొత్తు అని విమర్శ
- ఆ రెండు కూటముల కాలం చెల్లిందని వ్యాఖ్య
కేరళలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వామపక్ష, కాంగ్రెస్ పార్టీలపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు. కేరళలో వచ్చే నెల 6న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కేరళ వెళ్లిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు పరస్పరం వ్యతిరేకించుకుంటున్నాయని గుర్తు చేశారు.
మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ఆయా పార్టీలు పొత్తు కుదుర్చుకుని ఎన్నికల్లో పాల్గొంటున్నాయని విమర్శించారు. కేరళలో ఆ రెండు పార్టీల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌లు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఒకవేళ కేరళలో
ఆ రెండింటిలో ఏ కూటమైనా గెలిస్తే అది ప్రజల ఓటమి అవుతుందని చెప్పారు.
ఆ రెండు కూటముల కాలం చెల్లిందని, ప్రజలకు వారి పొత్తులు అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ఆయా పార్టీలు రాష్ట్ర ప్రజలకు తప్పుడు హామీలు ఇస్తున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఆ పార్టీలు అడ్డుపడుతున్నాయని విమర్శించారు.