Spain: స్పెయిన్ లో నాలుగు రోజులే పని
- మధ్యతరహా సంస్థలకు ఆర్థిక సాయం
- రూ.427 కోట్లు కేటాయింపు
- మూడేళ్ల పాటు ఇన్సెంటివ్ లు
- మొదటి ఏడాది 100% భరించనున్న సర్కార్
- తర్వాతి ఏడాది 50.. మరుసటి ఏడాది 25%
కరోనా కోరల్లో చిక్కుకుని భారీగా ప్రభావితమైన దేశాల్లో స్పెయిన్ ఒకటి. మొదట్లో కేసులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో ఆ దేశం టాప్ 5లోనే ఉంది. మహమ్మారితో ప్రపంచం మొత్తానికి తాళం పడిపోయింది. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. సంస్థల యజమానులు చాలా మందిని ఉద్యోగం నుంచి తీసేశారు. ఉన్న కంపెనీల్లో పని రోజులను తగ్గించారు. నాలుగు రోజులకు తగ్గించారు. పనిచేసిన ఆ నాలుగు రోజులకే జీతాలిచ్చారు. మిగతా రోజులకు జీతాలు లేకపోవడంతో చాలా మంది ఎన్నెన్నో బాధలు అనుభవించారు.
అయితే, స్పెయిన్ తాజాగా నాలుగు రోజుల పని దినాలను దేశవ్యాప్తంగా అధికారికం చేసింది. కంపెనీలు మిగతా రోజులకు జీతాలు ఇవ్వకపోతుండడంతో ఆ భారాన్ని భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పనిచేసిన రోజులకు కాకుండా.. తగ్గించిన ఆ ఒక్క రోజు జీతాన్ని భరిస్తూ సంస్థలకు ఇన్సెంటివ్ ల రూపంలో ఇవ్వనుంది. మూడేళ్ల పైలట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించనుంది. అందుకు సుమారు రూ.427 కోట్లను (5.9 కోట్ల డాలర్లు) కేటాయించింది.
ఆ నిధులను 200 మధ్యతరహా సంస్థలకు అందించనుంది. సంస్థలపై పడే అదనపు ఖర్చులను ప్రభుత్వం మొదటి ఏడాది వంద శాతం భరించనుంది. ఆ తర్వాతి సంవత్సరం 50 శాతం, మరుసటి ఏడాది 25 శాతం చొప్పున భరిస్తుంది. నాలుగు రోజుల పనిదినాలతో ఫుల్ టైం వర్కర్లకు ఎలాంటి నష్టమూ ఉండదని ఈ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన మాస్ పైజ్ ప్రొగ్రెసివ్ పార్టీకి చెందిన నేత హెక్టర్ టెజెరో చెప్పారు. ఈ పథకం కోసం తామేమీ యూరోపియన్ సమాఖ్య నిధులను వాడుకోవట్లేదన్నారు.
కాగా, పని గంటలను తగ్గించడం వల్ల 2017లో జీడీపీ 1.5 శాతం పెరిగిందని, కొత్తగా 5.6 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఇటీవలి ఓ నివేదిక స్పష్టం చేసింది. అంతేగాకుండా జీతాలూ 3.7 శాతం మేర పెరిగాయని పేర్కొంది. అయితే, ఇప్పుడు కరోనా మహమ్మారి ముంచేసిన తరుణంలో ఇలాంటి ప్రయోగాలు మంచివి కాదని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.