Narendra Modi: మోదీకి బంగారు, వెండి నాణేలు బహూకరించిన షేక్ హసీనా!

Sheik Haseena Gifted Gold Coins to Modi
  • బంగ్లాలో ముగిసిన రెండు రోజుల పర్యటన
  • ఐదు ఒప్పందాలపై రెండు దేశాల సంతకాలు
  • ప్రత్యేక పోస్టల్ స్టాంపు విడుదల
తమ దేశంలో రెండు రోజుల పర్యటనను ముగించుకుని, తిరిగి ఇండియాకు బయలుదేరిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్యా ఉన్న ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన షేక్ హసీనా, మోదీకి బంగారు, వెండి నాణాలను అందించారు. తన తండ్రి, 'బంగబంధు' ముజీబుర్ రెహమాన్ జయంతి వేడుకల సందర్భంగా ఈ నాణాలను విడుదల చేశారు. ఇదే సమయంలో ఇండియాతో గత 50 ఏళ్లుగా కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాలకు గుర్తుగా ప్రత్యేక పోస్టల్ స్టాంపును ఇరు నేతలూ విడుదల చేశారు.

అంతకుముందు తుంగిపారాలో ఉన్న ముజీబుర్ రెహమాన్ స్మారక కేంద్రాన్ని మోదీ సందర్శించారు. సత్ కీరా, ఒరాకాండీ ప్రాంతాల్లో ఉన్న చారిత్రక హిందూ దేవాలయాలను కూడా మోదీ సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా విపత్తుల నిర్వహణ నుంచి వాణిజ్యం వరకూ ఐదు ఒప్పందాలను బంగ్లాదేశ్ తో భారత్ కుదుర్చుకుంది. తొలుత ఉన్నతాధికారుల స్థాయిలో గంటపాటు చర్చలు జరుగగా, ఆపై హసీనాతో ప్రత్యేకంగా సమావేశమైన మోదీ, ఈ ఒప్పందాలను ఫైనలైజ్ చేశారు.

బంగ్లాదేశ్ తో వాణిజ్యంతో పాటు డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, ఆరోగ్యం, అభివృద్ధి దిశగా పరస్పర  సహకారం తదితర అంశాల్లో ఇరు నేతల మధ్యా చర్చలు జరిగాయని, ఐదు అవగాహనా ఒప్పందాలు కుదిరాయని కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొంది. ఇందులో భాగంగా రాజ్ షాహి కాలేజీలో క్రీడా వసతుల కల్పన, ఇరు దేశాల నేషనల్ కాడెట్ క్రాప్స్ మధ్య సమన్వయం, ఐసీటీ ఉపకరణాల సరఫరా, బంగ్లాదేశ్ - భారత్ డిజిటల్ సర్వీస్ సేవలకు రెండు దేశాలూ కలసి పనిచేయనున్నాయని అధికారులు తెలిపారు.

Narendra Modi
Haseena
Bangladesh
India
Gift

More Telugu News