Spiders: అంగారకుడి ఉపరితలంపై సాలీళ్లు... గుట్టువిప్పిన ట్రినిటీ కాలేజి పరిశోధకులు
- ఇప్పటిదాకా మిస్టరీగా ఉన్న సాలీడు తరహా ఆకారాలు
- డుర్హామ్ వర్సిటీ నిపుణులతో కలిసి ట్రినిటీ పరిశోధకుల అధ్యయనం
- కార్బన్ డయాక్సైడ్ రూపాలే ఆ సాలీళ్లని వివరణ
- ఘనీభవన స్థితి నుంచి నేరుగా వాయురూపం దాల్చినట్టు వెల్లడి
అరుణవర్ణ గ్రహం అంగారకుడిపై జీవం ఉందని భావిస్తూ పలు దేశాలు ముమ్మరంగా పరిశోధనలు జరుపుతున్నాయి. అయితే, అంగారకుడి ఉపరితలంపై సాలీళ్లను పోలిన ఆకారాలు చాలాకాలంగా ఓ మిస్టరీగా మారాయి. రాకాసి సాలీళ్లను తలపిస్తున్న ఆ ఆకారాలు అసలు జీవులేనా? అంటూ డబ్లిన్ లోని ట్రినిటీ కాలేజి పరిశోధకులు ఆసక్తికర అధ్యయనం చేపట్టారు. వారి పరిశోధనలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
మచ్చలను తలపించేలా ఉన్న ఆ ఆకృతులు అంగారకుడి ఉపరితలంపై సీజన్లు మారే సమయంలో ఏర్పడి ఉంటాయని, మంచురూపం దాల్చిన కార్బన్ డయాక్సైడ్ నేరుగా వాయురూపంలోకి మారడం వల్ల ఏర్పడిన మచ్చలని వివరించారు. అంగారకుడిపై కార్బన్ డయాక్సైడ్ వాయువు అత్యధికంగా ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల వాయువులు ఘనీభవిస్తాయి. అయితే తిరిగి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఘనీభవన స్థితి నుంచి నేరుగా వాయు రూపం సంతరించుకుంటాయి. దీన్నే ఉత్పాదనము అంటారు.
ఆ విధంగా ఏర్పడే మచ్చల వంటి ఆకారాలు సాలీడు కాళ్లను తలపించేలా పొడవైన నిర్మాణాలను కలిగి ఉంటాయి. దాంతో వాటిని రాకాసి సాలీళ్లుగా, ఓ మిస్టరీగా భావిస్తూ వచ్చారు. అయితే ట్రినిటీ కాలేజి పరిశోధకులు యూనివర్సిటీ నిపుణులతో కలిసి చేపట్టిన అధ్యయనంలో వీటి గుట్టు వీడింది. ప్రయోగశాలలో అంగారకుడి తరహా పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి ఈ పరిశోధన చేపట్టారు.