COVID19: కరోనా వ్యాక్సిన్లు మేం వాడుకున్న దానికన్నా ఎక్కువే ప్రపంచానికి ఇచ్చాం: ఐరాసకు భారత్ వివరణ
- సాధారణ సభలో టీకాల సరఫరాపై చర్చ
- 30 టీకాలపై ట్రయల్స్ జరుగుతున్నాయని వెల్లడి
- అసమానతలతో పేద దేశాలకు నష్టమని కామెంట్
ప్రపంచ దేశాలకు కోట్లాది డోసుల వ్యాక్సిన్లను సరఫరా చేశామని ఐక్యరాజ్యసమితి (ఐరాస)కి భారత్ తెలియజేసింది. తాము వాడుకున్న దాని కన్నా ఎక్కువే ఇచ్చామని వెల్లడించింది. యూఎన్ జనరల్ అసెంబ్లీ అనధికార సమావేశాల సందర్భంగా ఐరాసకు డిప్యూటీ శాశ్వత ప్రతినిధి కె. నాగరాజు.. వ్యాక్సిన్ల ఎగుమతిపై వివరించారు. భారత్ సొంతంగా తయారు చేసిన కొవాగ్జిన్ తో పాటు భారత్ లో ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్లను ప్రపంచదేశాలకు అందిస్తున్నామన్నారు. మరో 30 వ్యాక్సిన్లపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని తెలిపారు.
వ్యాక్సిన్ల సరఫరాలో అసమానతలుంటే కరోనాను జయించలేమని, పేద దేశాలపైనే భారం ఎక్కువగా పడుతుందని హెచ్చరించారు. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్లు వచ్చినా.. వాటిని అందుబాటులోకి తేవడం, అందరికీ అందించడం, సరఫరా చేయడంలోనే అతిపెద్ద సవాళ్లున్నాయని అన్నారు. ప్రపంచ దేశాల నుంచి సహకారం కొరవడడం, వ్యాక్సిన్లు అందించడంలో తేడాలుండడం వల్ల పేద దేశాలే ప్రభావితమవుతున్నాయని చెప్పారు. వ్యాక్సిన్ల అసమానతల వల్ల కొవ్యాక్స్ వంటి మంచి లక్ష్యం నీరుగారే ప్రమాదముందన్నారు.
రాబోయే ఆరు నెలల్లో భారత్ 30 కోట్ల మందికి టీకాలు వేయనుందని, అంతేగాకుండా ప్రపంచ దేశాలకూ టీకాలను సరఫరా చేస్తున్నామన్నారు. యూఎన్ పీస్ కీపర్ల (శాంతి పరిరక్షకులు)కు వ్యాక్సిన్లు ఇచ్చేందుకు భారత్ నుంచి శనివారం వ్యాక్సిన్లు బయల్దేరాయని, త్వరలోనే డెన్మార్క్ కు చేరుకుంటాయని చెప్పారు. కరోనా వైరస్ జన్యు క్రమ విశ్లేషణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముందని జనరల్ అసెంబ్లీకి ఆయన సూచించారు.