Mamata Banerjee: ఈ రోజు పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో 2016లో సత్తా చాటిన మమతా బెనర్జీ పార్టీ
- బెంగాల్ లో కొనసాగుతున్న తొలి విడత పోలింగ్
- 30 స్థానాలకు జరుగుతున్న ఓటింగ్
- 2016లో 30 స్థానాల్లో 26 సీట్లు టీఎంసీ పరం
దేశ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ లో మొత్తం 30 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. పురూలియా, జార్ గ్రామ్ జిల్లాలతో పాటు బంకువా, వెస్ట్ మిడ్నపూర్, ఈస్ట్ మిడ్నపూర్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 73 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటి... అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో ఒకటైన బెంగాల్ లో పాగా వేయాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. మరోవైపు బెంగాల్ లో అడుగుపెట్టే అవకాశం బీజేపీకి ఇవ్వకూడదనే పట్టుదలతో మమతకు చెందిన టీఎంసీ ఉంది.
అయితే, తొలి విడత పోలింగ్ జరుగుతున్న ఈ 30 నియోజకవర్గాల్లో అత్యధికం గతంలో టీఎంసీకి పట్టంకట్టినవి కావడం గమనార్హం. 2016 ఎన్నికల్లో ఈ 30 స్థానాల్లో 26 సీట్లను టీఎంసీ కైవసం చేసుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ 30 స్థానాల్లో టీఎంసీ 29 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఒక స్థానాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థికి కేటాయించింది.
ఇక బీజేపీ కూడా 29 స్థానాల్లో పోటీ చేస్తూ... మిత్రపక్షానికి ఒక సీటును కేటాయించింది. కాంగ్రెస్ 10 చోట్ల, వామపక్షాలు 18 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఈరోజు పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో గత ఎన్నికల్లో పూర్తి హవాను చాటిన టీఎంసీ... ఈ ఎన్నికల్లో ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.