CAA: పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం అందుకే తీసుకొచ్చింది: నిప్పులు చెరిగిన కేరళ సీఎం
- సీఏఏను మేం వ్యతిరేకించాం
- ప్రజలను భయపెట్టడంలో ఇదో భాగం
- యూపీలో రైళ్లలో నన్స్‌ను వేధిస్తున్నారు
- మత స్వేచ్ఛ కలిగిన మన దేశంలో ఇలాంటివి తగవు
దేశ ప్రజలను విభజించేందుకే కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) తీసుకొచ్చిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్ ఆరోపించారు. లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) దీనిని తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తు చేశారు. తిరువనంతపురంలోని ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ విజయన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘దేశ ప్రజలను విడగొట్టేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రజలను భయపెట్టే ప్రయత్నాల్లో ఇదో భాగం. ఏళ్ల తరబడి ఈ గడ్డపై నివసిస్తున్న వారిని ఇప్పుడు మీకు ఇక్కడ ఉండే హక్కు లేదని చెబుతున్నారు. ఈ బిల్లును ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఆదిలోనే వ్యతిరేకించింది. దీనిని కేరళలో అమలు చేయబోం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో ఓ రకం దుస్తులు ధరిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకున్నారని విజయన్ ఆరోపించారు. రైళ్లలో నన్స్‌ను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో ఇలాంటివి తగవన్నారు. ఇక్కడ మత స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు. అయితే, ఇతర మతాలను విశ్వసిస్తున్న వారిని చూసి సంఘ్ తట్టుకోలేకపోతోందని మండిపడ్డారు.