Johnny Bairstwo: బెయిర్ స్టో సెంచరీ... రెండో వన్డేలో లక్ష్యం దిశగా ఇంగ్లండ్
- పూణేలో భారత్, ఇంగ్లండ్ రెండో వన్డే
- మొదట బ్యాటింగ్ చేసిన భారత్
- 50 ఓవర్లలో 6 వికెట్లకు 336 రన్స్
- దీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్
- తొలి వికెట్ కు 110 పరుగుల భాగస్వామ్యం
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జానీ బెయిర్ స్టో శతకం బాదడంతో రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలుపు దిశగా పయనిస్తోంది. భారత్ విసిరిన 337 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ కు అద్భుతమైన ఆరంభం లభించింది.
తొలి వికెట్ కు 110 పరుగులు జోడించిన అనంతరం ఓపెనర్ జాసన్ రాయ్ (55) రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బెన్ స్టోక్స్ కూడా ధాటిగా ఆడడంతో ఇంగ్లండ్ స్కోరు ఎక్కడా తగ్గలేదు. ఈ క్రమంలో బెయిర్ స్టో సిక్సర్ల మోత మోగిస్తూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముఖ్యంగా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓవర్లలో ఇంగ్లండ్ ఆటగాళ్లు పరుగుల పండుగ చేసుకున్నారు.
ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు 33 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 238 పరుగులు చేసింది. బెయిర్ స్టో 109 పరుగులతోనూ, స్టోక్స్ 69 పరుగులతోనూ ఆడుతున్నారు. బెయిర్ స్టో స్కోరులో 9 ఫోర్లు, 6 సిక్సులున్నాయి. స్టోక్స్ 2 ఫోర్లు, 7 సిక్సర్లు బాదడం విశేషం. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 17 ఓవర్లలో 99 పరుగులు కావాలి. చేతిలో 9 వికెట్లున్నాయి.