Bharath Bundh: హైదరాబాద్ లో కనిపించని భారత్ బంద్ ప్రభావం... ఏపీలో చాలా జిల్లాల్లో రోడ్డెక్కని బస్సులు!

Bharat Bandh Started today Morning

  • సాగు చట్టాల రద్దు కోరుతూ బంద్
  • పంజాబ్, హర్యానాల్లో అధిక ప్రభావం
  • మిగతా రాష్ట్రాల్లో కనిపించని బంద్
  • ఏపీలో రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు

గత సంవత్సరం కేంద్రం తీసుకుని వచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ ఈ ఉదయం మొదలైంది. అయితే, దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో ఈ బంద్ ప్రభావం నామమాత్రంగా లేదా స్వల్పంగా ప్రభావాన్ని చూపుతోంది. పంజాబ్, యూపీ, హర్యానా తదితర రాష్ట్రాల్లో మాత్రం వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేస్తామని గురువారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగతా రాష్ట్రాల్లో బంద్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి.

ఈ ఉదయం హైదరాబాద్ లో బంద్ ప్రభావం ఏ మాత్రమూ కనిపించని పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్సుల నుంచి మెట్రో వరకూ అన్ని సేవలూ నడుస్తున్నాయి. ప్రజల దైనందిన కార్యకలాపాలపై ప్రభావం పడలేదు. ఇదే సమయంలో హిమాయత్ నగర్ ప్రాంతంలో మాత్రం వామపక్షాల కార్యకర్తలు బంద్ కు మద్దతుగా ఆందోళనకు దిగారు. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో బంద్ ప్రభావం లేకపోగా, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో మాత్రం స్వల్పంగా కనిపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, వాణిజ్య, వర్తక సంఘాలు బంద్ కు మద్దతు తెలపడం, ఇదే సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు, పెట్రోలు ధరల పెంపుకు నిరసనలు కొనసాగుతుండటంతో బంద్ మొదలైంది. పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు ఇంకా రోడ్డెక్కలేదు. విశాఖపట్నం, కర్నూలు జిల్లాల్లో వామపక్షాలు ఆర్టీసీ బస్సులను అడ్డుకోగా, బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.

విజయవాడ, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోనూ బంద్ కొనసాగుతోంది. ఈ ఉదయం షాపులు తెరచుకోలేదు. నిత్యావసరాలైన పాలు, కూరగాయల దుకాణాలు మాత్రమే తెరచుకున్నాయి. మధ్యాహ్నం తరువాత మాత్రమే ఆర్టీసీ బస్సులను బయటకు పంపుతామని అధికారులు వ్యాఖ్యానించడం గమనార్హం. పలు బస్ డిపోల ముందు వామపక్షాల నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ బంద్ కు విపక్ష తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, స్కూళ్లకు సెలవును ప్రకటించగా, హోటల్స్, వాణిజ్య కేంద్రాలు మూతపడ్డాయి.

  • Loading...

More Telugu News