KTR: చెత్తకుండీలు లేని నగరంగా హైదరాబాద్: కేటీఆర్
- కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి
- ఈ నేపథ్యంలో స్వచ్ఛత చాలా అవసరం
- జనాభాకు తగ్గట్టుగా స్వచ్చ వాహనాలను తీసుకొచ్చాం
దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కరోనా నేపథ్యంలో స్వచ్ఛత చాలా అవసరమని చెప్పారు. హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో ఈ ఉదయం 325 స్వచ్ఛ ఆటోలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్వచ్ఛ వాహనాలను తీసుకొచ్చినట్టు తెలిపారు. హైదరాబాదును చెత్తకుండీలు లేని నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. నగరాన్ని స్వచ్ఛంగా ఉంచే క్రమంలో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా తమ వంతు బాధ్యతను స్వీకరించాలని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని కోరారు.
హైదరాబాదును స్వచ్ఛంగా ఉంచేందుకు జీహెచ్ఎంసీ పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా చెత్తను తరలించేందుకు 650 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేసింది. తొలి విడతలో భాగంగా ఈరోజు 325 ఆటోలను కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ విజయలక్ష్మి, మంత్రి తలసాని తదితరులు హాజరయ్యారు.