Nirmala Sitharaman: జీఎస్టీ పరిధిలోకి 'పెట్రో'... తదుపరి సమావేశంలో చర్చకు సిద్ధమన్న నిర్మలా సీతారామన్!
- లోక్ సభలో ఫైనాన్స్ బిల్ 2021పై జరిగిన చర్చకు సమాధానం
- రాష్ట్రాలు అంగీకరిస్తే జీఎస్టీ పరిధిలోకి ధరలు
- వచ్చే సుంకాలను రాష్ట్రాలతో పంచుకుంటామన్న కేంద్రం
రోజురోజుకూ పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే సుంకాలే మొత్తం ధరలో సగానికి పైగా ఉన్నాయని విమర్శలు వస్తుండడం.. నేపథ్యంలో పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్న సంకేతాలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి వచ్చాయి.
తదుపరి జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయమై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. పెరుగుతున్న ధరలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు, మేధావులు డీజిల్, పెట్రోల్ ధరలను వస్తు సేవల పన్ను పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక, పెట్రోలు ధరపై సుంకాలు ఎలా ఉన్నాయంటే... ఉదాహరణకు ఢిల్లీనే తీసుకుంటే, లీటరు పెట్రోలు ధర రూ.91.17గా ఉంది. అందులో 60 శాతం పన్నులే. డీజిల్ విషయాన్నే పరిశీలిస్తే, రూ. 81.47గా లీటరు ధర ఉండగా, 53 శాతం పన్నులు. లోక్ సభలో ఫైనాన్స్ బిల్ 2021పై జరిగిన చర్చకు సమాధానంగా మాట్లాడిన నిర్మలా సీతారామన్, కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాలను తగ్గించాల్సివుందని అన్నారు. ఈ ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి వస్తే, కేంద్రం సుంకాలను రాష్ట్రాలతో పంచుకుంటుందని స్పష్టం చేశారు.
"నేడు జరిగిన చర్చ తరువాత నేనెంతో నిజాయతీగా ఆలోచించాను. ఎన్నో రాష్ట్రాలు దీన్ని పరిశీలిస్తున్నాయి. తదుపరి జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించడానికి సానుకూలంగా ఉన్నాము. ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలూ లేవు. అయితే, రాష్ట్రాలే ముందడుగు వేయాలి" అని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. కాగా, జీఎస్టీ కౌన్సిల్ కు నిర్మలా సీతారామన్ అధ్యక్షురాలిగా ఉండగా, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులూ ఇందులో సభ్యులుగా ఉన్నారు.