Carnatic vocalist: ‘హైదరాబాద్ సిస్టర్స్’లో ఒకరైన కుమారి లలిత కన్నుమూత
- కార్డియాక్ అరెస్ట్‌తో తుదిశ్వాస విడిచిన కుమారి లలిత
- రెండు రోజుల క్రితం యూట్యూబ్‌లో ఆన్‌లైన్ కచేరీ
- శోక సంద్రంలో సంగీత ప్రపంచం
తన అమృతగానంతో సంగీత ప్రపంచాన్ని దశాబ్దాలపాటు ఓలలాడించిన హైదరాబాద్ సిస్టర్స్‌లో ఒకరైన కుమారి లలిత నిన్న హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆమె తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె వయసు 70 సంవత్సరాలు. లలిత సోదరి శ్రీమతి హరిప్రియ. ఇద్దరూ కలిసి ఇచ్చే కచేరీలు సంగీత ప్రియులను దశాబ్దాలపాటు అలరించాయి.
లలిత 6 అక్టోబరు 1950లో జన్మించారు. తల్లి బి. సరోజ వద్దే సంగీత శిక్షణ ప్రారంభించిన లలిత తొమ్మిదో ఏటనే హైదరాబాద్ నల్లకుంటలోని శంకరమఠంలో తొలి కచేరీ ఇచ్చి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. లలిత, హరిప్రియలు తమ జీవితాన్ని సంగీతానికే అంకితం చేశారు. ఎంతోమంది శిష్యుల్ని తయారు చేశారు.
రామ్‌కోఠిలోని సంగీత కళాశాలలో లలిత సంగీత అధ్యాపకురాలిగా కూడా పనిచేశారు. ఈ నెల 20న ఉప్పలపాటి అంకయ్య 107వ జయంతి సందర్భంగా లలిత, హరిప్రియలు యూట్యూబ్‌లో ప్రత్యక్ష కచేరీ చేశారు. అంతలోనే ఆమె ఇక లేరన్న విషయం తెలిసి సంగీత ప్రపంచం శోక సంద్రంలో మునిగిపోయింది.