R Narayana Murthy: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి

Narayana Murthy thanked AP CM YS Jagan
  • ఏలేరు-తాండవ అనుసంధానంపై నారాయణమూర్తి స్పందన
  • తమ విజ్ఞప్తికి సీఎం జగన్ స్పందించారని వెల్లడి
  • పలు మండలాలకు నీటి సౌకర్యం ఏర్పడుతుందని వివరణ
  • ప్రజలతో పాటు తాను కూడా సీఎంకు రుణపడి ఉంటానని వ్యాఖ్యలు
ఏలేరు-తాండవ కాలువల అనుసంధానంపై సినీ నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏలేరు-తాండవ కాలువల అనుసంధానం ద్వారా సాగు, తాగునీటి సమస్యలు తీర్చాలని తాను ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలిసి సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశానని నారాయణమూర్తి వెల్లడించారు. తన విన్నపానికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని, వెంటనే నిధులు మంజూరు చేశారని వివరించారు.

ఈ రెండు కాలువల అనుసంధానం వల్ల విశాఖ జిల్లాకు చెందిన కోట వూరుట్ల, నాతవరం, నర్సీపట్నం మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలోని శంఖవరం, కోటనందూరు, ఏలేశ్వరం, రౌతులపూడి, ప్రత్తిపాడు మండలాలకు నీటి సౌకర్యం కలుగుతుందని అన్నారు. ఏలేరు-తాండవ పనుల నిమిత్తం రూ.470 కోట్లు మంజూరు చేశారని, అందుకు సహకరించిన మంత్రులు అనిల్ కుమార్, కన్నబాబులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని.... ఈ మండలాల ప్రజలతో పాటు తాను కూడా సీఎం జగన్ కు రుణపడి ఉంటానని ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా గానీ, కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. సీఎం జగన్ మాత్రం ఈ ప్రాంతాలను పచ్చనిపంటలతో కళకళలాడించేందుకు ఏలేరు-తాండవ అనుసంధానం పనులకు నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.
R Narayana Murthy
Jagan
Andhra Pradesh
Eleru-Thandava

More Telugu News