Atchannaidu: టీడీపీ తరఫున మూడు పులులు పార్లమెంటులో గళం విప్పుతున్నాయి... నాలుగో పులిని కూడా చేర్చండి: తిరుపతి ఓటర్లకు అచ్చెన్నాయుడి పిలుపు

Atchannaidu appeals Tirupati voters vote for TDP
  • తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు
  • ఏప్రిల్ 17న పోలింగ్
  • రేపు టీడీపీ అభ్యర్థి నామినేషన్
  • తిరుపతి ప్రజలు విజ్ఞులన్న అచ్చెన్నాయుడు
  • న్యాయం, ధర్మం కోసం టీడీపీకి ఓటేయాలని విజ్ఞప్తి
తిరుపతి పార్లమెంటు స్థానానికి మరికొన్ని రోజుల్లో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. కొండెక్కి కూర్చున్న సీఎం జగన్ ను కిందికి దించాలంటే తిరుపతి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాలని అన్నారు.  టీడీపీ తరఫున మూడు పులులు (రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కేశినేని నాని) పార్లమెంటులో ఏపీ కోసం నిరంతరం గళం విప్పి పోరాడుతున్నాయని, తిరుపతిలో తమ అభ్యర్థికి ఓటేసి అదనంగా మరో పులిని కూడా చేర్చండి అని తిరుపతి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

రేపు ఉదయం నామినేషన్లు వేస్తున్నామని, ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు ఎంతో వ్యత్యాసం ఉంటుందని, ప్రజలు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని వివరించారు.

2019లో ప్రజలు 22 మంది గొర్రెలను గెలిపించారని, కానీ వాళ్లు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడట్లేదని విమర్శించారు. వైసీపీ మరోసారి ధనబలంతో గెలిచేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అయితే, తిరుపతి ఓటర్లు విజ్ఞులని, న్యాయం, ధర్మం కోసం టీడీపీకి ఓటేయాలని కోరారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుంది.
Atchannaidu
Tirupati LS Bypolls
TDP
Voters
Parliament

More Telugu News