Botsa Satyanarayana: ఏం రహస్యాలు బయటకొచ్చాయో నాకైతే అర్థం కావడం లేదు: బొత్స
- లేఖలు లీక్ అయ్యాయని హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్
- సీబీఐ చేత విచారణ జరిపించాలని విన్నపం
- మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిలకు నోటీసులిచ్చిన హైకోర్టు
రాష్ట్ర గవర్నర్ హరిచందన్ కు తాను పంపిన లేఖలు లీక్ అయ్యాయని, దీనిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రతివాదులుగా మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీలను చేర్చారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిలకు నోటీసులు ఇచ్చింది.
హైకోర్టు నోటీసులపై బొత్స స్పందిస్తూ... నిమ్మగడ్డకు సంబంధించిన ఏ రహస్యాలు బయటకు వచ్చాయో తనకైతే అర్థం కావడం లేదని అన్నారు. అయితే, రాజ్యాంగ ప్రక్రియలో రహస్యాలెందుకని ఆయన ప్రశ్నించారు. ఇక, ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి తాను రాను అని నిమ్మగడ్డ చెప్పిన విషయాన్ని కమిటీనే చూసుకుంటుందని మంత్రి చెప్పారు.