Andhra Pradesh: ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం... ప్రత్యేక హోదా కుదరదు: మళ్లీ స్పష్టం చేసిన కేంద్రం

Centre gives clarity on special status for AP
  • లోక్ సభ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశం
  • కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ రామ్మోన్ నాయుడు
  • కేంద్రం వివరణపై అసంతృప్తి
  • విభజన అంశాలు రెండు రాష్ట్రాలు చర్చించుకోవాలన్న మంత్రి
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్న విషయం మరోసారి వెల్లడైంది. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని, ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏపీకి ప్రత్యేక హోదా వీలుకాదని పేర్కొంది. రాష్ట్ర పునర్విభజన చట్టం అమలుపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రం నుంచి వివరణ కోరారు. అయితే కేంద్రం ఇచ్చిన జవాబు సంతృప్తికరంగా లేదని చెప్పడంతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ స్పందించారు.

పునర్విభజన చట్టానికి సంబంధించిన అనేక అంశాలు అమల్లో ఉన్నాయని, పలు విభజన హామీలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. విద్యాసంస్థల నిర్మాణాలు, ప్రాజెక్టుల పూర్తికి చాలా సమయం పడుతుందని పేర్కొన్నారు. పునర్విభజన చట్టం అమలులో తలెత్తే సమస్యలను ఉభయ తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని సూచించారు.

ప్రత్యేక ప్యాకేజీతో సంబంధం లేకుండా ప్రత్యేక హోదా ఇవ్వాలి: మిథున్ రెడ్డి

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో సంబంధం లేకుండా ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్ సభలో కేంద్రాన్ని కోరారు. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లయినా పునర్విభజన చట్టంలోని అంశాలు నెరవేరలేదని తెలిపారు. అందుకు గల కారణాలు ఏంటో కేంద్రం చెప్పాలని అన్నారు. తమకు ఎలాంటి ప్యాకేజీ అవసరం లేదని, ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
Andhra Pradesh
Special Status
Kinjarapu Ram Mohan Naidu
Lok Sabha
Mithun Reddy

More Telugu News