Rajasthan: ఆడుకుంటూ అనంత లోకాలకు.. రాజస్థాన్ లో 8 మంది చిన్నారుల మృతి
- కంటెయినర్ లో ఊపిరాడక ఐదుగురి బలి
- వారంతా తోబుట్టువులేనన్న పోలీసులు
- మట్టిపెళ్లలు పడి మరో ముగ్గురు
- సంతాపం తెలిపిన ఆ రాష్ట్ర సీఎం
ఆటలాడుతూ.. గెంతుతూ తుళ్లే పసిప్రాయం వారిది. ఆడుకుంటున్న ఆ చిన్నారులను కంటెయినర్, మట్టిపెళ్లల రూపంలో విధి కాటేసింది. రాజస్థాన్ లో రెండు వేర్వేరు విషాద ఘటనల్లో 8 మందిని బలి తీసుకుంది. వారి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. ఆ వివరాలను పోలీసులు వెల్లడించారు.
బికనీర్ జిల్లాలోని హిమ్మతసర్ లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు (తోబుట్టువులు) ఆడుకుంటూ పక్కనే ఉన్న కంటెయినర్ లోకి వెళ్లారు. అయితే, అనుకోకుండా ఆ కంటెయినర్ మూసుకుపోవడంతో పిల్లలంతా చిక్కుకుపోయారు. ఊపిరాడక చనిపోయారు. అయితే, ఇంటికి వచ్చేసరికి పిల్లలు కనిపించకపోవడంతో కంగారు పడిన వారి తల్లి.. చుట్టుపక్కలంతా వెదికింది. ఎక్కడా కనిపించలేదు.
పక్కనే ఉన్న కంటెయినర్ దగ్గరకు వెళ్లి తలుపు తెరిచి చూసేసరికి.. అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలు కనిపించారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. చనిపోయిన చిన్నారులను పూనమ్ (8), రవీనా (7), రాధ (5), సేవారామ్ (4), మాలిగా గుర్తించారు.
ఝన్ ఝన్ లో జరిగిన మరో ఘటనలో ఆడుకుంటున్న పిల్లలపై మట్టిపెళ్లలు విరిగి పడడంతో ముగ్గురు చిన్నారులు చనిపోయారు. మరొకరికి గాయాలయ్యాయి. మట్టి పెళ్లలు విరిగిపడిన వెంటనే ఆ చిన్నారులను ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. చనిపోయిన చిన్నారులను ప్రిన్స్ (7), సురేశ్ (7), సోనా (10)గా గుర్తించారు. గాయపడిన చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. చిన్నారుల మృతి పట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంతాపం ప్రకటించారు.