rajaiah: టీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి, రాజయ్య మధ్య పేలిన మాటల తూటాలు!
- రాజయ్యను చెల్లని రూపాయిగా అభివర్ణించిన కడియం
- ఆయన చేతకానివాడని వ్యాఖ్యలు
- ఏ నియోజకవర్గానికైనా ఎమ్మెల్యేనే సుపీరియర్ అన్న రాజయ్య
- పార్టీ వ్యతిరేకులను గుర్తించాలని వ్యాఖ్య
టీఆర్ఎస్ నేతలు, మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, తాడికొండ రాజయ్య మధ్య మాటల తూటాలు పేలాయి. ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశించి కడియం శ్రీహరి తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వారిద్దరి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. నియోజక వర్గంలో ఆధిపత్యం కోసం వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని స్పష్టమైంది.
రాజయ్యను చెల్లని రూపాయిగా అభివర్ణిస్తూ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేతకానివాడని, ఒక్క రూపాయి కూడా సహాయం చేయడని అన్నారు. తాను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఎవరి దగ్గరనుంచైనా ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపించినా ముక్కు నేలకు రాస్తానని కడియం శ్రీహరి అన్నారు.
కడియం శ్రీహరి మాటలపై స్పందించిన రాజయ్య.. ఏ నియోజకవర్గానికైనా ఎమ్మెల్యేనే సుపీరియర్ అని వ్యాఖ్యానించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎవరున్నప్పటికీ ఎమ్మెల్యేలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తారని ఆయన అన్నారు.
నియోజకవర్గంలో ఏక నాయకత్వంతో ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని రాజయ్య పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేకులను, పార్టీ పట్ల విధేయత లేని వారిని అధిష్ఠానం గుర్తించాలని ఆయన వ్యాఖ్యానించారు.