AstraZeneca: మా టీకాలో ఏ జంతువు పదార్థాలను వినియోగించలేదు.. స్పష్టం చేసిన ఆస్ట్రాజెనెకా
- ఇండోనేసియాలో వచ్చిన వదంతులపై స్పందన
- పందికి సంబంధించిన పదార్థాల్ని వాడలేదని స్పష్టం
- పునఃసమీక్షించి ఓకే చేసిన ఇండోనేసియా ఔషధ నియంత్రణ సంస్థ
ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా టీకాలో పందితో సంబంధం ఉన్న ఉత్పత్తుల్ని వినియోగించారంటూ ఇండోనేసియాలో వచ్చిన వార్తల్ని సంస్థ తోసిపుచ్చింది. ఈ టీకాలో పంది క్లోమంలో ఉండే ట్రిప్సిన్‌ని వినియోగించారని ఆ దేశానికి చెందిన అత్యున్నత ముస్లిం మత సంస్థ ఉలేమా కౌన్సిల్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. దీంతో ఈ టీకా వినియోగంపై ఆ దేశంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. అయినప్పటికీ, ప్రాణాంతక కరోనా మహమ్మారి విజృంభిస్తున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని టీకా వినియోగానికి కౌన్సిల్ అనుమతించింది.
దీనిపై ఆ దేశంలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా స్పందించింది. వ్యాక్సిన్ తయారీలో పందికిగానీ లేదా ఇతర ఏ జంతువులతోనైనా సంబంధం ఉన్న పదార్థాలను ఉపయోగించలేదని స్పష్టం చేసింది. ఈ టీకా వల్ల రక్తం గడ్డకడుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఇండోనేసియా ఔషధ నియంత్రణ సంస్థ ప్రయోగ ఫలితాల్ని మరోసారి సమీక్షించింది. వ్యాక్సిన్ వినియోగానికి అనుమతించింది.