Coronil: 'కరోనిల్'కు అనుమతి లేదన్న ఐఎంఏ.. ఖండించిన పతంజలి!
- కరోనిల్‌కు అనుమతి లభించలేదన్న ఐఎంఏ
- ఐఎంఏ ప్రకటనను ఖండించిన పతంజలి
- సీడీఎస్‌సీఓ సమాధానంపై భిన్నాభిప్రాయాలు
- కరోనా రెండో వేవ్‌ను కట్టడి చేయాలని ఐఎంకు పతంజలి హితవు
కరోనా వైరస్‌కు ఔషధంగా పేర్కొంటూ మార్కెట్‌లోకి పతంజలి తెచ్చిన ‘కరోనిల్’కు ఎలాంటి అధికారిక అనుమతులు లభించలేదని ‘ఇండియన్ మెడికల్ అసోసియేషన్' (ఐఎంఏ) స్పష్టం చేసింది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీఓ) నుంచి అందిన సమాచారంలో ఈ విషయం తేలిందని పేర్కొంది.
సమాచార హక్కు చట్టం ద్వారా సీడీఎస్‌సీఓను సమాచారం కోరగా.. ‘కరోనా చికిత్స కోసం కరోనిల్‌ను ఆమోదిస్తూ తాము ఎటువంటి అనుమతి ఇవ్వలేదు’ అని తెలిపినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు జయలాల్ మాట్లాడుతూ.. కరోనిల్ కొవిడ్-19ను నివారించే ఔషధం కాదని.. ఎవరైనా అలా ప్రచారం చేస్తే అది దేశ ప్రజల్ని మోసం చేయడమేనని వ్యాఖ్యానించారు. కరోనా చికిత్సకు శాస్త్రీయమైన పద్ధతులు ఉన్నాయని.. స్వార్థంతో కొంత మంది చేసే ప్రకటనలకు మోసపోవద్దని కోరారు.
ఈ విషయంలో పతంజలి స్పందన ఐఎంఏ ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఉండడం గమనార్హం. సీడీఎస్‌ఓ సమాధానాన్ని ఐఎంఏ అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని పతంజలి ఆరోపించింది. ‘‘ఆయుష్ మంత్రిత్వ శాఖను సంప్రదించిన తర్వాత కరోనిల్ ఔషధానికి అనుమతి ఇచ్చాం’’ అని ఆర్‌టీఐకి ఇచ్చిన సమాధానంలో సీడీఎస్‌సీఓ స్పష్టంగా పేర్కొందని చెప్పుకొచ్చింది. అయినా ఐఎంఏ అధికారులు తప్పుడు ఆరోపణలు చేయడం విచారకరమని వ్యాఖ్యానించింది. అలాగే కరోనా రెండో వేవ్ మొదలవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని.. దాన్ని కట్టడి చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఐఎంఏకు హితవు పలికింది.