YS Sharmila: మంత్రి గంగులకు షర్మిల అనుచరురాలు ఇందిరా శోభన్ కౌంటర్
- ముంపు మండలాలు ఏపీకి ఎప్పుడు వెళ్లాయో తెలుసుకుని మాట్లాడాలి
- ఆ మండలాలు వెళ్లిపోతున్నప్పుడు టీఆర్ఎస్ ఏం చేసింది?
- గెజిట్ నోటిఫికేషన్ ఇస్తున్నప్పుడు టీఆర్ఎన్ నేతలు ఏం చేశారు?
తెలంగాణలో కొత్త పార్టీని ప్రారంభించబోతున్న వైయస్ షర్మిల... త్వరలోనే ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. పార్టీని పటిష్ఠం చేసే కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇదే సమయంలో ఆమె పార్టీ నేతలు టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా షర్మిల అనుచరురాలు ఇందిరా శోభన్ మాట్లాడుతూ, పోలవరం ముంపు మండలాలు ఏపీకి ఎప్పుడు వెళ్లాయనే విషయాన్ని తెలుసుకుని టీఆర్ఎస్ నేతలు మాట్లాడాలని అన్నారు. ముంపు మండలాలు తరలిపోతున్నప్పుడు టీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్లు ఇస్తుంటే టీఆర్ఎస్ నేతలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇటీవల షర్మిల గురించి మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, నీవు తెలంగాణ కోడలయినట్టైతే ఏపీలో కలిపిన ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను తిరిగి ఇప్పించాలని అన్నారు. ఆ ఏడు మండలాల కోసం పాదయాత్ర చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని వ్యాఖ్యానించారు.