Nara Lokesh: స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు సూసైడ్ నోట్ చూస్తే బాధేస్తోంది: నారా లోకేశ్
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
- కార్మికుల నిరసనలు.. తగ్గని కేంద్రం
- కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి
- సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైన ఉద్యోగి
విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్రం ఎంతకీ దిగిరాకపోవడంతో కార్మికులు, ఉద్యోగుల్లో తీవ్ర అసహనం పెల్లుబుకుతోంది. ఈ క్రమంలో శ్రీనివాసరావు అనే స్టీల్ ప్లాంట్ ఉద్యోగి రాసిన సూసైడ్ నోట్ తీవ్ర కలకలం రేపింది.
విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం 32 మంది ప్రాణత్యాగం చేశారని, వారి ఆత్మ బలిదానాలు వృథా కారాదని, తాను కూడా అగ్నికి ఆహుతై బలిదానం చేస్తానని, తన ప్రాణత్యాగంతో మళ్లీ ఉక్కు గర్జన ప్రారంభం కావాలని శ్రీనివాసరావు తన లేఖలో పేర్కొన్నాడు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఉక్కు కర్మాగారం ఉద్యోగి శ్రీనివాసరావు సూసైడ్ నోట్ చూశాక చాలా బాధ కలిగిందని పేర్కొన్నారు. కేసుల మాఫీ కోసం జగన్ రెడ్డి కేంద్రం పెద్దల కాళ్ల మీద పడడం వల్లే విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కార్మికులు ప్రాణ త్యాగాలు చేసే నిర్ణయం తీసుకోవద్దని చేతులెత్తి మరీ వేడుకుంటున్నానని లోకేశ్ పేర్కొన్నారు.
కార్మికులకు టీడీపీ అండగా నిలుస్తుందని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఏంచేసేందుకైనా టీడీపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా తాము పోరాడతామని వెల్లడించారు. ఇప్పటికైనా కార్మికుల కుటుంబాలలో నెలకొన్న ఆందోళనను జగన్ రెడ్డి అర్థం చేసుకుని మౌనం వీడాలని లోకేశ్ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును కొట్టేసే ప్రయత్నాన్ని ఆపాలని పేర్కొన్నారు.
కాగా, సూసైడ్ నోట్ రాసిన ఉద్యోగి శ్రీనివాసరావు ఆచూకీ లేకుండా పోవడంతో అతడి కోసం గాలింపు జరుగుతోంది.