Boris Johnson: ముందుగా చెప్పినట్లే ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వేయించుకున్న బోరిస్ జాన్సన్
- ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై పలు దేశాల్లో అనుమానాలు
- నమ్మకం కలిగించిన బ్రిటన్ ప్రధాని
- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌నే వేయించుకున్న ఫ్రాన్స్ ప్రధాని
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ సమర్థతపై ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతోన్న వేళ తాను ఆ వ్యాక్సిన్‌నే వేసుకుని దానిపై నమ్మకాన్ని నిలుపుతానని ఇటీవలే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. చెప్పినట్లే ఆయన లండన్‌లో సెయింట్ థామస్ ఆస్పత్రిలో ఆ వ్యాక్సిన్‌ను వేయించుకుని ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
వ్యాక్సిన్ వేయించుకోవడం మంచి అనుభూతిని కలిగించిందని, ఈ ప్రక్రియ చాలా త్వరగా అయిపోయిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ వేయించుకుంటే మనకు మన కుటుంబాలకు మంచిదని చెప్పారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగానికి ఐరోపాకు చెందిన శాస్త్రవేత్తలు అనుమతిని పునరుద్ధరించారని బోరిస్ తెలిపారు.
అలాగే, ఫ్రాన్స్ ప్రధాని జీన్ కాస్టెక్స్ కూడా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌నే వేయించుకుని, కరోనా ముప్పు నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్ వేయించుకోవడమే ఉత్తమమని చెప్పారు. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ భారత్‌లోనూ పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతోన్న విషయం తెలిసిందే.