Cattle feed: మధ్యాహ్న భోజనం పథకానికి 'పశువుల దాణా'.. అవాక్కయిన అధికారులు!
- పూణె మున్సిపల్ స్కూల్‌లో ఘటన
- రంగంలోకి దిగిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ
- తప్పుబట్టిన పూణె నగర మేయర్
- కారకులపై చర్యలు తీసుకుంటామని హామీ
భారత్‌లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం ఇప్పటి వరకు అనేక సార్లు వివాదాస్పదమయింది. దాన్ని అమలు చేస్తున్న తీరే అందుకు కారణం. తాజాగా పూణెలోని ఓ మున్సిపల్ స్కూల్‌లో మరో వివాదం తెరపైకి వచ్చింది. దేశంలోని అత్యంత ధనవంతమైన కార్పొరేషన్లలో పూణె మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి. ఈ ఏడాది జనవరి 15 వరకు రూ.3,285 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇంతటి ఆర్థిక వనరులు ఉన్న నగరంలోని మున్సిపల్ స్కూల్ నెం 58లో తాజా ఘటన జరగడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే... కొవిడ్‌ను కట్టడి చేయడంలో భాగంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో పిల్లలకు మధ్యాహ్న భోజనం ఇంటికి చేరేలా చర్యలు చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం సంబంధింత యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో పూణె కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న 58వ నెంబర్ మున్సిపల్ స్కూల్‌కు పశువుల దాణా మధ్యాహ్న భోజన పథకం వస్తువుల కింద అందింది. దీన్ని చూసిన అధికారులు ఒక్కసారి షాక్‌కి గురయ్యారు. దీన్ని స్థానిక సామాజిక కార్యకర్తలు హైలైట్ చేయడంతో విషయం ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)’ దృష్టికి వెళ్లింది. రంగంలోకి దిగిన వారు దాణాను రికవర్ చేసుకున్నారు.
దీనిపై స్పందించిన పూణె మేయర్ మురళీధర్ మొహోల్.. వచ్చిన ఆహార పదార్థాల్ని పంచడం మాత్రమే తమ విధి అని తెలిపారు. అయితే, దాణా రావడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆమె.. దీనికి కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్ఫష్టం చేశారు.