Facebook: ఇకపై రెండంచెల్లో... కొత్త సెక్యూరిటీ అప్ డేట్ తీసుకువచ్చిన ఫేస్ బుక్
- స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్
- ఇప్పటివరకు డెస్క్ టాప్ వెర్షన్లో లభ్యం
- ఇకపై ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు కూడా ప్రత్యేక ఫీచర్
- పాస్ వర్డ్ తో పాటు కొత్తగా సెక్యూరిటీ కీ
ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం ఫేస్ బుక్ సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ తీసుకువచ్చింది. ఇకపై స్మార్ట్ ఫోన్ లో ఫేస్ బుక్ లోకి లాగిన్ అవ్వాలంటే రెండంచెల విధానం తప్పనిసరి. పాస్ వర్డ్ తో పాటు సెక్యూరిటీ కీ ద్వారానే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. టెక్ పరిభాషలో దీన్ని '2 ఫ్యాక్టర్ అథెంటికేషన్' (two-factor-authentication) అంటారు. ఈ తరహా రెండంచెల లాగిన్ విధానం హ్యాకర్ల బారి నుంచి యూజర్ల ఫేస్ బుక్ ఖాతాలను రక్షిస్తుంది. యూజర్ తన ఫేస్ బుక్ ఖాతాలోకి లాగిన్ అయ్యే ప్రతిసారి పాస్ వర్డ్ ను, సెక్యూరిటీ కీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఖాతా తెరుచుకుంటుంది.
ఫేస్ బుక్ డెస్క్ టాప్ వెర్షన్ లో ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ 2017 నుంచి అందుబాటులో ఉంది. తాజాగా దీన్ని స్మార్ట్ ఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి తెచ్చారు.
దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే... మొదట ఫేస్ బుక్ లో సెక్యూరిటీ అండ్ లాగిన్ సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. స్క్రోల్ డౌన్ చేసి use two factor authentication ఫీచర్లోని 'ఎడిట్' బటన్ పై క్లిక్ చేయాలి. దాంట్లోని సూచనల ఆధారంగా సెక్యూరిటీ మెథడ్ ను ఎంచుకోవాలి. ఇందులో రెండు ఆప్షన్లు ఉంటాయి. థర్డ్ పార్టీ అథెంటికేషన్ యాప్ నుంచి వచ్చే కోడ్స్ కావాలా, లేక ఫోన్ ద్వారా అందే టెక్ట్స్ (ఎస్సెమ్మెస్) కోడ్స్ కావాలా అనేది యూజర్ ఎంచుకోవాలి.
అందులోంచి ఏదో ఒకటి ఎంచుకుంటే చాలు... అక్కడ్నించి యూజర్ ఫేస్ బుక్ ఖాతా లాగిన్ మరియ భద్రతా విధానం మారిపోతుంది. అంతేకాదు, ఎవరైనా మీ ఖాతాను గుర్తు తెలియని డివైస్, బ్రౌజర్ నుంచి తెరిచేందుకు జరిగే ప్రయత్నాల పట్ల మిమ్మల్ని అప్రమత్తం చేస్తూ సందేశాలు వస్తాయి.