India: చెలరేగిన సూర్యకుమార్ యాదవ్.. నాలుగో టీ20లో భారత్ విజయం!

India defeat England by 8 runs

  • 8 పరుగుల తేడాతో భారత్ విజయం
  • అరంగేట్ర మ్యాచ్‌లోనే సూర్యకుమార్ అర్ధ సెంచరీ
  • 2-2తో ఇప్పటికి సిరీస్ సమం

తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు చివరి వరకు పోరాడింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించి, ఇప్పటికి సిరీస్ ను సమం చేసింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గత రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో కోహ్లీసేన 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా 2-2తో సిరీస్ సమమైంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(12), రాహుల్ (14), కెప్టెన్ కోహ్లీ (1) హార్దిక్ పాండ్యా (11), శార్దూల్ ఠాకూర్ (10) వంటి వారు నిరాశ పరిచినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే నిప్పులు చెరిగాడు.

ఆడిన తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన సూర్యకుమార్ తన ఉద్దేశాన్ని స్పష్టంగా చాటాడు. 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి అదరహో అనిపించాడు. పంత్ 30, శ్రేయాస్ అయ్యర్ 37 పరుగులు చేేయడంతో భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.  

ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 4 వికెట్లు తీసుకోగా, అదిల్ రషీద్, మార్క్ వుడ్, క్రిస్ జోర్డాన్, శామ్ కరన్ చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 186 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లిష్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్ జాసన్ రాయ్(40), బెన్ స్టోక్స్ (46) చెలరేగి ఆడి భారత శిబిరంలో గుబులు రేపారు. అయితే, భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు వారి ఆటలు సాగలేదు. ఇంగ్లండ్ జట్టులో వారిద్దరి తర్వాత బెయిర్ స్టో (25) ఒక్కడే కాస్త పరవాలేదనిపించాడు. మిగతా వారిలో ఎవరూ పెద్దగా ఆడలేదు.

ఇంగ్లండ్ విజయానికి చివరి రెండు బంతులకు 9 పరుగులు అవసరం కావడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే, ఒక్క పరుగే రావడంతో భారత్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, హార్దిక్ పాండ్యా, రాహుల్ చాహర్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్ ఓ వికెట్ పడగొట్టాడు. అర్ధ సెంచరీతో అదరగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

  • Loading...

More Telugu News