Farm Laws: అహం వీడి సాగు చట్టాల్ని రద్దు చేయండి.. కేంద్ర సర్కార్‌కు పంజాబ్ సీఎం హితవు
- ఇంకో ప్రత్యామ్నాయమే లేదన్న అమరీందర్ సింగ్
- పంజాబ్ చట్టసభలు చేసిన సవరణల బిల్లును రాష్ట్రపతి ఆమోదించాల్సిందే
- లేదంటే సుప్రీంకోర్టుకు వెళతామన్న సీఎం
- ఇంకా ఎంతమంది రైతులు చనిపోవాలని నిలదీత
కేంద్ర ప్రభుత్వం అహం వీడి వెంటనే నూతన సాగు చట్టాల్ని రద్దు చేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ డిమాండ్ చేశారు. నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులతో సమగ్రంగా చర్చించి కొత్త చట్టాల్ని తీసుకురావాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు.
అలాగే కేంద్ర సాగు చట్టాలకు సవరణలు చేస్తూ రాష్ట్రంలో తీసుకొచ్చిన సవరణ బిల్లుల్ని రాష్ట్రపతి ఆమోదించకపోతే.. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని అమరీందర్ అన్నారు. సవరణ బిల్లుల్ని గవర్నర్ ఇంకా రాష్ట్రపతికి పంపాల్సి ఉందన్నారు. చట్టాల్ని రద్దు చేయడం తప్ప ఇంకో మార్గమే తనకు కనిపించడం లేదన్నారు. ఇప్పటి వరకు 112 మంది రైతులు చనిపోయారని.. ఇంకా ఎంత మంది ప్రాణాలు కోల్పోవాలని కేంద్ర సర్కార్‌ను నిలదీశారు.
ఈ సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్ తీరుపైనా కెప్టెన్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర చట్టసభలు చేసిన సవరణ బిల్లుల్ని గవర్నర్ ఇంకా ఎప్పుడు రాష్ట్రపతికి పంపుతారని ప్రశ్నించారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అంటూ అసహనం వ్యక్తం చేశారు.