Ritika Phogat: ఓడినందుకు మనస్తాపం.. రెజ్లర్ బబిత ఫొగట్ సోదరి రితిక ఆత్మహత్య

Ritika Phogat cousin of Geeta and Babita Phogat commits suicide

  • ఫైనల్‌లో ఒకే ఒక్క పాయింట్ తేడాతో ఓటమి
  • ఆ తర్వాతి రోజే ఆత్మహత్య
  • దిగ్భ్రాంతి చెందిన క్రీడాలోకం 

ఫైనల్ మ్యాచ్‌లో ఒకే ఒక్క పాయింట్ తేడాతో ఓడిపోయానన్న మనస్తాపంతో ప్రముఖ మహిళా రెజ్లర్లు గీతా, బబిత ఫొగట్‌ల సోదరి రితిక ఫొగట్ (కజిన్) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయసు 17 సంవత్సరాలు. విషయం తెలిసిన క్రీడా ప్రపంచం నివ్వెరపోయింది.

 ఈ నెల 12 నుంచి 14 వరకు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో రెజ్లింగ్ పోటీలు జరిగాయి. రాష్ట్రస్థాయి జూనియర్ విమెన్, సబ్ జూనియర్ పోటీల్లో రితిక పాల్గొంది. ఈ పోటీల్లో ఆది నుంచి మంచి ప్రతిభ కనబరిచిన రితిక ఫైనల్‌కు చేరుకుంది. ఈ నెల 14న జరిగిన ఫైనల్‌లో ఒకే ఒక్క పాయింట్ తేడాతో ఓటమి పాలైంది.

ఫైనల్‌లో ఎదురైన ఓటమి అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన రితక ఈ నెల 15న తన స్వగ్రామమైన బాలాలిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఆటలో గెలుపోటములు సహజమని, ఓడినంత మాత్రానికే ఇలాంటి తీవ్ర నిర్ణయం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది.

రాష్ట్రస్థాయి పోటీల్లో ఓటమి పెద్ద విషయం కాదని, రితిక ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో తమకు అర్థం కావడం లేదని ఆమె సోదరుడు హర్వీంద్ర కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఓటమి తర్వాత తన తండ్రి మెన్‌పాల్, కోచ్ మహావీర్‌లు రితికకు ధైర్యం చెప్పారని అన్నాడు. కానీ, ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేకపోయామన్నాడు. ఉజ్వల భవిష్యత్ ఉన్న రితిక ఆత్మహత్య చేసుకుందన్న విషయాన్ని వెల్లడించడానికి ఎంతో బాధపడుతున్నట్టు కేంద్ర మంత్రి విజయ్ కుమార్ సింగ్ ట్వీట్ చేశారు. రితిక మృతిపై దర్యాప్తు చేస్తున్నట్టు హర్యానాలోని చర్ఖి దాద్రి జిల్లా ఎస్పీ రామ్ సింగ్ బిష్ణోయ్ తెలిపారు.

  • Loading...

More Telugu News