Astrazeneca Vaccine: ఆస్ట్రాజెనెకా సురక్షితమే.. నేనూ అదే టీకా తీసుకోబోతున్నా: బోరిస్ జాన్సన్
- టీకా వాడకాన్ని నిలిపివేసిన పలు ఐరోపా దేశాలు
- ఆస్ట్రాజెనెకా టీకాపై బ్రిటన్ పార్లమెంటులో చర్చ
- బ్రిటన్‌లో 11 మిలియన్ల మందికి ఇప్పటికే ఆస్ట్రాజెనెకా టీకా
ఆస్ట్రాజెనెకా టీకా వల్ల దుష్ప్రభావాలు సంభవిస్తున్నాయంటూ పలు దేశాలు దాని వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకడుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మాత్రం ఇది పూర్తిగా సురక్షితమని పదేపదే చెబుతోంది. ఆస్ట్రాజెనెకా కూడా ఈ వార్తలను ఖండించింది.
ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా స్పందించారు. ఆస్ట్రాజెనెకా టీకా పూర్తి సురక్షితమని, తాను కూడా త్వరలోనే ఆ వ్యాక్సిన్‌ను తీసుకోబోతున్నానని పేర్కొన్నారు. పలు ఐరోపా దేశాలు ఈ వ్యాక్సిన్ ఉపయోగాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టడంపై బ్రిటన్ పార్లమెంటులో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు బోరిస్ సమాధానమిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. కరోనాపై ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తోందన్నారు. బ్రిటన్‌లో ఇప్పటి వరకు 25 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వగా అందులో 11 మిలియన్ల మంది ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను తీసుకున్నారు.