IAF: కుప్పకూలిన మిగ్-21 బైసన్.. వాయుసేన పైలట్ మృతి
- గ్వాలియర్ వాయుస్థావరం వద్ద జరిగిన ప్రమాదం
- టేకాఫ్ అవుతుండగానే కూలిన విమానం
- పైలట్ కుటుంబానికి అండగా ఉంటామని ఐఏఎఫ్ హామీ
- విచారణకు ఆదేశించిన అధికారులు
భారత వాయుసేనకు చెందిన మిగ్-21 బైసన్ విమానం బుధవారం ఉదయం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ ఎ.గుప్తా మృతి చెందారు. గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి శిక్షణ కార్యక్రమాల నిమిత్తం టేకాఫ్ అవుతుండగా.. ఉదయం గం. 10.50 సమయంలో నేలకూలినట్లు వాయుసేన వర్గాలు తెలిపాయి. గుప్తా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని అధికారులు హామీ ఇచ్చారు. అలాగే ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.
గత 18 నెలల్లో మిగ్-21 శ్రేణి విమానాలు ప్రమాదానికి గురికావడం ఇది మూడోసారి. 2019 సెప్టెంబర్‌లో ఇదే వాయుస్థావరంలో మిగ్21 ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదాల్లో భారత్ విమానాలను నష్టపోవడంతో పాటు అత్యంత విలువైన ఫైటర్ పైలట్లను కూడా కోల్పోయాం.
రష్యా నుంచి కొనుగోలు చేసి 1960లో వాయుసేనలోకి ప్రవేశపెట్టిన మిగ్-21 ఆధునిక వెర్షన్ విమానాలే ఈ మిగ్-21 బైసన్. పుల్వామా ఉగ్రదాడి తర్వాత 2019, ఫిబ్రవరి 27న పాక్ వాయుసేనతో జరిగిన ఘర్షణలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఇదే మిగ్-21 బైసన్‌తో శత్రుమూకల ఎఫ్-16ను నేలకూల్చారు.