Bentley: భారత విపణిలో బెంట్లీ కొత్త కారు... ధర రూ.4.10 కోట్లు
- బెంటేగా మోడల్ ను మరింత అభివృద్ధి చేసిన బెంట్లీ
- 2016లో బెంటేగా రంగప్రవేశం
- సరికొత్త ఫీచర్లతో తాజా కారు
- 4.5 సెకన్లలోనే 100 కిమీ వేగం
- బెంటేగా టాప్ స్పీడ్ గంటకు 290 కిమీ
బ్రిటన్ లగ్జరీ కార్ల తయారీదారు బెంట్లీ భారత మార్కెట్లో బెంటేగా ఎస్ యూవీ కొత్త వెర్షన్ ను తీసుకువచ్చింది. నెక్ట్స్ జనరేషన్ ఫీచర్స్ తో అలరారే ఈ సరికొత్త మోడల్ భారత్ లోని సంపన్న వర్గాలను ఆకట్టుకుంటుందని బెంట్లీ భావిస్తోంది. దీని ఖరీదు రూ.4.10 కోట్లు (ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర). బెంటేగా మోడల్ ను 2016లో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దాన్ని మరింత అభివృద్ధి చేశారు.
బెంట్లీ బెంటేగా ఎస్ యూవీ 4.0 ట్విన్ చార్జ్ డ్ టర్బో వీ8 పెట్రోల్ ఇంజిన్ ను కలిగివుంది. ఇందులో అధునాతనమైన ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. 10.9 అంగుళాల స్క్రీన్, సూపర్ హై రిజల్యూషన్ గ్రాఫిక్స్ తో అత్యంత సులువైన కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఇక ఈ కారులో అణువణువు లగ్జరీ ఉట్టిపడేలా నిర్మించారు. లేటెస్ట్ బెంట్లీ డీఎన్ఏ ప్లాట్ ఫాంపై దీన్ని డిజైన్ చేశారు. ఎక్స్ టీరియర్, ఇంటీరియర్స్ ను మరింత ఆధునికీకరించారు. సీటింగ్ ను మరింత విశాలంగా మార్చారు.
ఇంజిన్ విషయానికొస్తే 542 బీహచ్ పీ వద్ద 770 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. బెంట్లీ బెంటేగా కారు టాప్ స్పీడ్ గంటకు 290 కిలోమీటర్లు కాగా, 100 కిలోమీటర్ల స్పీడ్ ను కేవలం 4.5 సెకన్లలోనే అందుకోవడం దీని ప్రత్యేకత. కాగా బెంట్లీ కార్లు భారత్ లోని పలువురు సినీ ప్రముఖుల వద్ద ఉన్నాయి. టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ వద్ద కూడా బెంట్లీ కారు ఉన్నట్టు తెలుస్తోంది.