Errabelli: అండర్-16 పరుగుల రాణికి మంత్రి ఎర్రబెల్లి సత్కారం
- ఇటీవల కేరళలో సౌత్ జోన్ అథ్లెటిక్స్ పోటీలు
- 2000 మీటర్ల రేసులో స్వర్ణం గెలిచిన కీర్తన
- మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి ఎర్రబెల్లిని కలిసిన కీర్తన
- కీర్తనను అభినందించిన ఎర్రబెల్లి
- ప్రోత్సాహం అందిస్తే మరో పీటీ ఉష అవుతుందని వెల్లడి
జనగామ జిల్లా గూడూరుకు చెందిన చెరిపెల్లి కీర్తన అథ్లెటిక్స్ రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తోంది. పాలకుర్తి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న కీర్తన ఇటీవల కేరళలో జరిగిన దక్షిణ భారత జూనియర్ అథ్లెటిక్స్ మీట్ లో పసిడి పతకం గెలిచింది. అండర్-16 కేటగిరీలో 2000 మీటర్ల మెరుగైన టైమింగ్ తో ప్రథమస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో కీర్తన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మినిస్టర్స్ గృహసముదాయంలో కలిసింది.
జూనియర్ అథ్లెటిక్స్ రంగంలో కీర్తన చూపుతున్న ప్రతిభ పట్ల మంత్రి ఎర్రబెల్లి హర్షం వ్యక్తం చేశారు. ఆమెను తన చాంబర్ లో సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, ఉన్నతస్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. కీర్తన సౌత్ జోన్ అథ్లెటిక్స్ పోటీల్లో గోల్డ్ మెడల్ గెలవడంతో ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో క్రీడా శిక్షణ, అందించే ఆహారం నాణ్యత మరోసారి వెల్లడయ్యాయని ఎర్రబెల్లి పేర్కొన్నారు. చదువుతోపాటు క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కీర్తన వంటి ఆణిముత్యాలకు మరింత చేయూతనిస్తే పీటీ ఉషలా దేశానికి వన్నె తీసుకువస్తుందని అభిప్రాయపడ్డారు.