TMC: టికెట్ ఇవ్వకపోవడంతో టీఎంసీకి గుడ్ బై చెప్పిన సినీ నటి
- టీఎంసీ నుంచి రెండు సార్లు గెలుపొందిన దేబశ్రీ రాయ్
- 2019 నుంచే పార్టీని వీడే యోచనలో దేబశ్రీ
- ఏ పార్టీలో చేరడానికైనా సిద్ధమేనని వ్యాఖ్య
పశ్చిమబెంగాల్ లో మమతాబెనర్జీ పార్టీ టీఎంసీకి పలువురు గుడ్ బై చెపుతున్నారు. తాజాగా సినీ నటి దేబశ్రీ రాయ్ కూడా టీఎంసీని వీడారు. టీఎంసీ తరపున ఆమె రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 నుంచే పార్టీని వీడాలనే ఆలోచనలో ఆమె ఉన్నారు. ఈ ఎన్నికలలో ఆమెకు మమత టికెట్ నిరాకరించడంతో చివరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలో తనకు ఎలాంటి పదవి లేదని... అందువల్ల తన రాజీనామా లేఖను కూడా పార్టీకి పంపించాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే, టీఎంసీతో కలసి ఉండాలనుకోవడం లేదు అనే విషయాన్ని చెప్పడానికే పార్టీ హైకమాండ్ కు లేఖ రాశానని తెలిపారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని రాయ్ డిగి నియోజకవర్గం నుంచి ఆమె రెండు సార్లు గెలుపొందారు.
బీజేపీలో చేరబోతున్నారా? అనే ప్రశ్నకు బదులుగా... ప్రస్తుతానికి తన యాక్టింగ్ కెరీర్ పైనే దృష్టి సారించాలనుకుంటున్నానని దేబశ్రీ తెలిపారు. అయితే ఏ పార్టీ అయినా సరైన ప్రపోజల్ తో సంప్రదిస్తే ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమని చెప్పారు. 2019లో ఆమె బీజేపీలో చేరడం దాదాపు ఖరారైంది. అయితే టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సోవన్ చటర్జీ, బైశాఖీ బందోపాధ్యాయ్ లు ఆమె బీజేపీలో చేరడాన్ని వ్యతిరేకించారు. దీంతో, కాషాయ పార్టీలో ఆమె చేరిక ఆగిపోయింది. మరోవైపు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో సోవన్ చటర్జీ ఆ పార్టీకి గెడ్ బై చెప్పారు.