WHO: త్వరలో శీతలీకరణ, సూదులు గుచ్చే అవసరంలేని వ్యాక్సిన్లు వస్తున్నాయి: డబ్ల్యూహెచ్ఓ
- ప్రపంచ దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్
- కొత్తరకం టీకాలు వస్తున్నాయన్న డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్టు
- వాటిని గది ఉష్ణోగ్రత వద్ద భద్రపరచవచ్చని వెల్లడి
- ఆ వ్యాక్సిన్ల పనితీరు తమను ఆశ్చర్యానికి గురిచేస్తోందని వివరణ
కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాలు ప్రతి దేశంలోనూ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆసక్తికర అంశం వెల్లడించింది. త్వరలోనే సూదులు గుచ్చే అవసరంలేని వ్యాక్సిన్లు రంగప్రవేశం చేయనున్నాయని, సాధారణ వ్యాక్సిన్ల తరహాలో వీటిని కోల్డ్ స్టోరేజిల్లో ఉంచాల్సిన అవసరంలేదని వివరించింది. ఈ వ్యాక్సిన్లను సాధారణ గది ఉష్ణోగ్రత వద్దే భద్రపరచవచ్చని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు.
ఈ వ్యాక్సిన్లకు సంబంధించి క్లినికల్ అధ్యయనాలు పూర్తయ్యాయని, ఈ ఏడాది చివరి నాటికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. అన్నీ కూలిస్తే ఈ ఏడాది చివరి కల్లా, లేకపోతే వచ్చే ఏడాది ఈ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ వ్యాక్సిన్ల పనితీరు తమను అచ్చెరువొందిస్తోందని, వాటిని మరింత అభివృద్ధి చేస్తామని సౌమ్య స్వామినాథన్ వివరించారు.