Nauheera Shaikh: ఒవైసీ కుట్ర కారణంగానే నేను అరెస్టయ్యాను: నౌహీరా షేక్
- హీరా గోల్డ్ కుంభకోణంలో అరెస్టయిన నౌహీరా
- బెయిల్ పై విడుదల
- ఒవైసీతో ఓ స్థల వివాదం ఉందని వెల్లడి
- అందువల్లే ఒవైసీ తనను కేసులో ఇరికించాడని ఆరోపణలు
హీరా గోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై ఆరోపణలు చేశారు. ఈ కేసులో బెయిల్ పై విడుదలైన నౌహీరా మీడియాతో మాట్లాడుతూ, ఒవైసీ కుట్రల కారణంగానే తాను అరెస్ట్ అయ్యానని వెల్లడించారు.
టోలీచౌకీలో ఉన్న ఓ స్థలం విషయంలో తనకు, అసదుద్దీన్ ఒవైసీకి మధ్య వివాదం ఏర్పడిందని, అందువల్లే తనపై అక్రమకేసులు బనాయించారని ఆరోపించారు. తాను జైల్లో ఉన్న సమయంలో ఒవైసీ తనకు చెందిన 20 ఎకరాలను కబ్జా చేశారని పేర్కొన్నారు. ఒక స్త్రీ వ్యాపారంలో ఎదగడాన్ని ఒవైసీ ఓర్చుకోలేకపోతున్నాడని విమర్శించారు.
హీరా గోల్డ్ లో కుంభకోణం జరిగిందన్న ఆరోపణల్లో నిజంలేదని, హీరా గోల్డ్ సంస్థకు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని, ఎవరికీ అన్యాయం చేయబోమని నౌహీరా స్పష్టం చేశారు. ఒవైసీ ఆరోపణలన్నీ ఫేక్ అని కొట్టిపారేశారు. 1988 నుంచి హీరా గ్రూప్ కార్యకలాపాలు సాగిస్తోందని వెల్లడించారు. కానీ చిన్న కేసు ఆధారంగా మహారాష్ట్రలో తనను అరెస్ట్ చేశారని, పేరుమోసిన నేరగాళ్ల తరహాలో తనను విచారించడం బాధాకరమని పేర్కొన్నారు.