Municipal Elections: రేపు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు... కేంద్రాల వద్ద 144 సెక్షన్
- ఈ నెల 10న ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్
- 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు
- 20,419 మంది పోలీసులతో భారీ బందోబస్తు
- ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ షురూ
ఏపీలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు ఈ నెల 10న ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు (మార్చి 14) ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్, చిలకలూరిపేట మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు నిలిపివేశారు.
కాగా, మిగిలిన ప్రాంతాల్లో రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత కోసం 20,419 మంది పోలీసులను నియమించారు. 172 మంది డీఎస్పీలు, 476 మంది సీఐలు... 1,345 మంది ఎస్సైలు... 17,292 మంది కానిస్టేబుళ్లతో పాటు 1,134 మంది ఇతర సిబ్బంది భద్రతా విధుల్లో పాలుపంచుకోనున్నారు.