Ghantasala Seethamahalakshmi: పింగళి వెంకయ్య కుమార్తెకు రూ.75 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కు పిలుపునిచ్చిన మోదీ
- మాచర్లలో పింగళి వెంకయ్య కుమార్తెను కలిసిన సీఎం జగన్
- నగదును పింగళి కుమార్తె ఖాతాలో జమచేసిన సర్కారు
- వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన సీఎం
మువ్వన్నెల జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులకు ఏపీ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మికి రాష్ట్ర సర్కారు రూ.75 లక్షల ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
ప్రధాని మోదీ పిలుపునిచ్చిన 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కార్యాచరణలో భాగంగా సీఎం జగన్ ఇవాళ గుంటూరు జిల్లా మాచర్లలో పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని ఆమె నివాసంలో కలిశారు. ఆర్థికసాయం తాలూకు ఉత్తర్వుల ప్రతిని సీఎం ఆమెకు అందజేశారు. అనంతరం నగదును ఆమె ఖాతాలో జమ చేశారు.
కాగా, తెలుగుజాతి పేరు ప్రతిష్ఠలను మరింత ఇనుమడింప చేసిన పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.