Kangana Ranaut: కంగన రనౌత్ పై కేసు నమోదు చేయాలంటూ కోర్టులో పిటిషన్
- వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ జరుగుతున్న కార్యక్రమాలపై కంగన ట్వీట్లు
- సిక్కులను కించపరిచేలా ట్వీట్లు ఉన్నాయని పిటిషన్
- పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపణ
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే బాలీవుడ్ నటి కంగన రనౌత్ తాజాగా మరో చిక్కులో పడ్డారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసన కార్యక్రమాలపై ఆమె చేసిన ట్వీట్లు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆమెపై పలువురు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమెపై కేసు నమోదు చేయాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.
ఈ పిటిషన్ ను ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ ప్రెసిడెంట్ మణీందర్ సింగ్ సిర్సా దాఖలు చేశారు. నిరసనల్లో పాల్గొంటున్న రైతులతో పాటు, సిక్కు సామాజికవర్గాన్ని కించపరిచేలా కంగన వ్యాఖ్యలు చేశారని పిటిషన్ లో ఆరోపించారు. కంగనపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు తిరస్కరించారని చెప్పారు. అందువల్లే తాము కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. కంగన ట్వీట్లు దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పారు. మత ఘర్షణకు దారితీసేలా ఉన్నాయని అన్నారు.
ఈ పిటిషన్ ను విచారించిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు... దీనిపై నివేదిక సమర్పించాల్సిందిగా ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. యాక్షన్ టేకెన్ రిపోర్టు (ఏటీఆర్)ను ఏప్రిల్ 24లోగా అందజేయాలని ఆదేశించింది.